
వివాదంలో థర్మల్ ‘పవర్’
థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీపీసీఐఎల్) సంస్థ నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు వస్తున్నాయి.
థర్మల్ పవర్‌టెక్ నుంచి 570 మెగావాట్ల కొనుగోళ్లకు డిస్కంల ఒప్పందం
అక్రమాలు జరిగాయని ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లిన నిపుణులు
సాక్షి, హైదరాబాద్: థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీపీసీఐఎల్) సంస్థ నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు వస్తున్నాయి. యూనిట్‌కు రూ. 4.15 చొప్పున 570 మెగావాట్ల కొనుగోళ్లకు సంబంధించిన ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ సంస్థ కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాలరావు ఆరోపించారు. టెండర్లలో థర్మల్ పవర్‌టెక్ కంపెనీ ఒకటే ‘సింగిల్ బిడ్’గా పోటీలో మిగిలేలా డిస్కంలు చక్రం తిప్పాయని పేర్కొన్నారు. బహిరంగ విచారణ నిర్వహించకుండా ఆమోదించిన ఈ ఒప్పందంపై పునః సమీక్ష జరపాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీ) చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్‌కు ఆయన గురువారం వినతి పత్రం అందజేశారు.
రూ. 2,784 కోట్ల భారం...
థర్మల్ పవర్‌టెక్ సంస్థ తొలిదశ ప్రాజెక్టు నుంచి యూనిట్‌కు రూ.3.58 చొప్పున 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు మూడేళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగు డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నా యి. అందులో స్థిరచార్జీ రూ.1.82 మాత్రమే. తాజా గా తెలంగాణలోని రెండు డిస్కంలు ఇదే కంపెనీ రెండోదశ ప్లాంట్ల నుంచి యూని ట్‌కు రూ.4.15 చొప్పున 570 మెగావాట్ల కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతేగాకుండా రెండోదశ స్థిర చార్జీలను యూనిట్‌కు రూ.2.64గా నిర్ణయించారు. తొలిదశతో పోల్చితే ఈ స్థిర చార్జీలు యూనిట్‌కు 82పైసలు అధికం.
ఈ లెక్కన వినియోగదారులపై ఏటా రూ. 348 కోట్ల చొప్పున 8 ఏళ్ల ఒప్పంద కాలంలో రూ. 2,784 కోట్ల అదనపు భారం పడుతుందని వేణుగోపాలరావు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. థర్మల్ పవర్‌టెక్‌తో డిస్కంలు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్ అండ్ ఆపరేట్(డీబీఎఫ్‌ఓఓ) పద్ధతిలో కొనుగోళ్ల కోసం కేంద్రం రూపొం దించిన ప్రామాణిక బిడ్డింగ్ డాక్యుమెంట్‌కు రెండు పర్యాయాలు సవరణలు జరిపి థర్మల్‌పవర్ టెక్ మాత్రమే బిడ్డింగ్‌లో మిగిలే విధంగా టెండర్లను నిర్వహించారని పేర్కొన్నారు. పారదర్శకత కోసం ఈ ఒప్పందంపై సుమోటోగా పునః సమీక్ష జరపాలని కోరారు. థర్మల్ పవర్‌టెక్ కంపెనీ ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందినది కావడం గమనార్హం.