రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉంటే అర్హులే
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు జారీ
పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. క్రమబద్ధీకరణను చేపట్టడానికి ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న చట్టాన్ని సవరించడంతోపాటు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులోని నిబంధనల ప్రకారం 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగంలో ఉండి, క్రమబద్ధీకరణ నిర్ణయం అమలయ్యే నాటికి కొనసాగుతున్న వారందరినీ రెగ్యులరైజేషన్‌కు అర్హులుగా పరిగణిస్తారు. అయితే సంబంధిత శాఖలో సమాన కేటగిరీలో రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉంటేనే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది.
ఫుల్‌టైమ్ కాంట్రాక్టు పద్ధతిన నియామకమై నెలనెలా వేతనం పొందిన వారిని మాత్రమే క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకుంటారు. విద్యా, సంక్షేమ శాఖల్లో ఏడాది మధ్యలో వచ్చే సెలవులను గైర్హాజరుగా పరిగణించకుండా మినహాయింపు ఉంటుంది. అనధికారిక గైర్హాజరు, క్రమశిక్షణా రాహిత్యం వంటి అంశాల్లో ఈ మినహాయింపు వర్తించదు. ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచే రెగ్యులరైజేషన్ అమల్లోకి వస్తుంది. క్రమబద్ధీకరణ ద్వారా పోస్టుల రిజర్వేషన్లకు విఘాతం కలిగితే ఆ కేటగిరీ పోస్టులను బ్యాక్‌లాగ్ పోస్టులుగా పరిగణించి భర్తీ చేయాల్సి ఉంటుంది.
కొత్త మార్పులతో పాత చట్టం
జనవరి రెండో తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్రమబద్ధీకరణకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టం (1994 యాక్ట్ 2) అడ్డంకిగా ఉండడంతో ఫిబ్రవరి 7న దీనిపై మంత్రిమండలి మరోమారు చర్చించి, చట్ట సవరణకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్-1994ను తగిన సవరణలతో తెలంగాణ రాష్ట్రానికి అన్వయించారు. ప్రభుత్వ శాఖలన్నింటా కేవలం మూడు పద్ధతుల ద్వారా నియామకాలు జరగాలని పాత చట్టంలోని పదో సెక్షన్ పేర్కొంటోంది. ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, రెండోది డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీలు, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీల (డీఎస్సీ) ద్వారా, మూడోది ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీ ద్వారా క్రమబద్ధీకరించడం. వీటితోపాటు కొత్తగా కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులైన వారిని క్రమబద్ధీకరించే అంశాన్ని ఇదే సెక్షన్‌లో 10(ఏ)గా చేర్చారు.
దాదాపు 25 వేల మందికి లబ్ధి
ప్రభుత్వం తీసుకున్న క్రమబద్ధీకరణ నిర్ణయంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖలో పనిచేస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉన్న లెక్చరర్లు సైతం రెగ్యులరైజ్ అవుతారు. మార్గదర్శకాలు ఖరారు కావటంతో ఏ శాఖలో ఎంత మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు, నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఎంత మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుందనే వివరాలను తెప్పించుకునేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఎంత మంది రెగ్యులరైజ్ అవుతారనే లెక్క తేలనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రత్యేక ప్రాజెక్టులు, పథకాల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ వర్తించదని అధికార వర్గాలు వెల్లడించాయి.