విపక్షాలు పూర్తిగా విఫలం -మంత్రి హరీశ్‌రావు
విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయి
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. విపక్షాలు ఒక వ్యూహమంటూ లేకుండానే వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో తమదే పూర్తిగా పైచేయి అయిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సమర్థంగా చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. గతంలో తాము కూడా ప్రతిపక్షంలో ఉన్నామని, ప్రస్తుత ప్రతిపక్షాలకు భిన్నంగా ఒక వ్యూహంతో వ్యవహరించేవారమని గుర్తు చేశారు. అన్ని అంశాలపై మాట్లాడాలనుకుని ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు వారి దగ్గర ఏ అంశమూ లేదని అన్నారు. సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒకటీ రెండు అంశాలను తీసుకుని పూర్తి స్థాయిలో వాటివెంటే పడుతూ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తాయని, కానీ ఇప్పుడు విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.
సిద్దిపేట నగదు రహితానికి ‘ఆధార్ పే’
సిద్దిపేటను నగదు రహిత లావాదేవీలకు మార్చేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నేపథ్యంలో బ్యాంకు ప్రతినిధులు కొందరు మంత్రి హరీశ్‌రావును అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకువచ్చిన కొత్త ‘ఆధార్ పే మర్చంట్ డివైజ్’ను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సిద్దిపేటలో అన్ని రకాల లావాదేవీలకు ‘ఆధార్ పే’యంత్రాలను అమర్చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తగినన్ని మెషిన్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు అధికారులు గతంలో రూ.10వేలు వెచ్చించి కొనుగోలు చేసిన మైక్రో ఏటీఎంల స్థానే రూ. 1800 విలువ చేసే ఆధార్ ఆధారిత మర్చంట్ ఫింగర్ ప్రింట్ మిషన్ పనితీరునూ మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ మర్చంట్ మిషన్‌ను రూ.వెయ్యికే ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. 5 వేల మర్చంట్ మిషన్లలకు మంత్రి వెంటనే ఆర్డర్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు తన ఆధార్ నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌తో స్వయంగా లింక్ చేసుకున్నారు.