హామీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కేంద్ర బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ స్పందన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, విభజన చట్టం మేరకు హామీలను సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఈసారి కూడా నిరాశే ఎదురైందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీని సాధించుకోలేకపోయామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవ రానికి కూడా తగినన్ని కేటాయింపులు లేవని విమర్శించారు. రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. పట్టిసీమకు ఖర్చు చేసిన నిధులను పోలవరం ప్రాజెక్టు ఖాతాలో వేసుకోవాలని సూచించడం దారుణమని బుగ్గన పేర్కొన్నారు. ధాన్యం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను గత ఏడాది కేవలం యాభై రూపాయలే పెంచారని, ఈ ఏడాది బడ్జెట్‌లో అసలు ఎమ్మెస్పీ ఊసే లేదని విమర్శించారు.
రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం మొత్తం రుణాల్లో వ్యవసాయ రంగానికి 18 శాతం ఇవ్వాలని ఉంటే గత ఏడాది 7 శాతానికి తగ్గించారని, ఇప్పుడు ఆ విషయం కూడా పేర్కొనలేదన్నారు. సాగునీటి రంగానికి బడ్జెట్ రూ.15వేల కోట్లు పెంచడం హర్షణీయమన్నారు. ఎల్పీజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.2,000 కోట్లు, గ్రామీణ గృహాల విద్యుద్దీకరణకు రూ.5,000 కోట్ల కేటాయింపు మంచిదేనన్నారు.
సర్కార్ వైఫల్యమే ఇది: అంబటి విమర్శ
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు సర్కార్ చేతకానితనం వల్లే ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ర్టప్రభుత్వం సరిగా పోరాడి ఉంటే రాష్ట్రానికి మరిన్ని నిధులు దక్కేవని అన్నారు. విభజన హామీలను నెరవేర్చేందుకు గాను చంద్రబాబు ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం శోచనీయమన్నారు. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రయోజనాలు కాపాడడంలో విఫలమయ్యాడన్నారు.
సోమవారం ఆయన ఇక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తారని యావత్ రాష్ర్టం ఆశగా ఎదురుచూసిందని, కేంద్రం దానిని పట్టించుకోనేలేదన్నారు. అదిగో హోదా ఇదిగో ప్రకటన అంటూ ఊరించడమే గానీ అందుకోసం రాష్ట్రం ప్రయత్నిస్తున్నట్లే కనిపించలేదని అంబటి అన్నారు. అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరాశచెందారన్నారు. జాతీయహోదా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లే కేటాయించడం అన్యాయమని అంబటి వ్యాఖ్యానించారు. రూ.40వేల కోట్ల ప్రాజెక్టుకు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తూ పోతే వందేళ్లకయినా ఈ ప్రాజెక్టు పూర్తికాదన్నారు.