పాలమూరు, డిండిపైనే దృష్టి! | The focus on the Palamuru and Dindi | Sakshi
Sakshi News home page

పాలమూరు, డిండిపైనే దృష్టి!

Published Sat, Sep 17 2016 2:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

The focus on the Palamuru and Dindi

అపెక్స్ కౌన్సిల్‌లో వీటిపైనే తొలి చర్చ
- ఎజెండాకు కేంద్రమంత్రి ఉమాభారతి ఆమోదం
- నేడు రాష్ట్రాలకు ఎజెండా కాపీలు
- డీపీఆర్‌లు ఇవ్వకపోవడంపై ఏపీ, తెలంగాణలపై బోర్డు ఆగ్రహం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులే ప్ర దాన అంశంగా అపెక్స్ కౌన్సిల్ ఎజెండా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర జల వనరుల శాఖ దీనికి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. వీటిపై చర్చ ముగిసిన తర్వాత పట్టిసీమ, పోలవరం కింద తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటా, కృష్ణాలో ఏపీ ఉల్లంఘనలు, బోర్డు నియంత్రణపై, అలాగే ఏపీ తెరపైకి తెచ్చిన జూరాలలో నీటి వినియోగం, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశాలను చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమావేశ ఎజెండాకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఓకే చెప్పినట్లుగా సమాచారం.

ఎజెండా కాపీలను కేంద్రం శనివారం ఉదయం పంపే అవకాశాలున్నాయని తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేం దుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలి సింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 120 టీఎంసీలు తరలిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాల మూరు, డిండి ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన రైతులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. నెలరోజుల్లోగా అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించాలంటూ జూలైలో కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే పాలమూరు డిండికి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది.
 
 19లోగా డీపీఆర్‌లు ఇవ్వండి
 కృష్ణా జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వివరాలు కోరుతున్నా సమర్పించకపోవడంపై కృష్ణా బోర్డు తెలంగాణ, ఏపీపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు సంబంధించి ఏపీ.. పాలమూరు, డిండి, కల్వకుర్తిలపై తెలంగాణ ప్రభు త్వం డీపీఆర్‌లను సమర్పించాలంటూ శుక్రవారం 2 రాష్ట్రాలకు లేఖలు రాసింది. డీపీఆర్‌లు ఇవ్వకుంటే ఎలా స్పందించాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో.. బోర్డు తుది హెచ్చరికగా రెండు రాష్ట్రాలకు ఈ లేఖలు పంపింది. ఈ నెల 19లోగా డీపీఆర్‌లు ఇవ్వాలని ఆదేశించింది. ఇరు రాష్ట్రాలు ఇచ్చే డీపీఆర్‌లనే అపెక్స్ కౌన్సిల్ ముందు పెడతామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement