
అయామ్ సో హ్యాపీ!
► ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నిలబెట్టుకుంది: సీఎం కేసీఆర్
► ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపిద్దాం
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువు పెట్టుకుని నిబద్ధతతో పని చేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైందని, ఇప్పటివరకు చేసిన పనులే కాదు.. చెప్పినవన్నీ చేసి చూపిద్దామని వ్యాఖ్యానించారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నిలబెట్టుకుందంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో పోచమ్మ ఆలయం పునఃప్రతిష్ట అనంతరం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయటంలో అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో విమర్శలు. ఎన్నో అవహేళనలు. ఈ ప్రభుత్వం చెప్పిన పనులేవీ చేయదని, ఉత్తి మాటలతో కాలం గడుపుతుందని కొందరు ఎగతాళి చేశారు.
కొత్త జిల్లాలు కానే కావు. కొత్త డివిజన్లు, మండలాలు రావు. ఇంటింటికీ తాగునీరు రానే రాదు. చెరువుల కార్యక్రమం సాగేది కాదు.. ఇలాంటి విమర్శలెన్నో వచ్చాయి. ఇవన్నీ అధిగమించాం. అనుకున్నది చేస్తాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలకు కల్పించాం. ఇప్పుడు కొత్త జిల్లాలు కొలువు దీరాయి. కలెక్టరేట్లు, కలెక్టర్లు, ఎస్పీలందరితో కొత్త జిల్లాలు కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ ఊహించని విధంగా జిల్లా ఆఫీసులు ప్రజల చెంతకు చేరాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పరిపాలన అత్యంత చేరువైంది’’ అని సీఎం అన్నారు. ‘‘దసరాకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలని పదేపదే నిర్ణీత గడువు లక్ష్యంగా పని చేయటంతోనే ఇది సాధ్యమైంది.
దసరా రోజున చేయాలని ముందునుంచి అనుకోకుంటే ఇప్పట్లో అయ్యేది కాదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించే పథకాన్ని సైతం ఇదే నిర్ణీత గడువుతో చేపట్టాం. అందుకే మొదటి దశ విజయవంతంగా పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో అన్ని గ్రామాలకు తాగునీటిని అందించి చూపిద్దాం. ఇప్పటివరకు చేసిన పనులే కాదు.. చెప్పినవన్నీ చేసి చూపిద్దాం. అందరం కలిసి పని చేద్దాం. కొత్త సెక్రటేరియట్, కళాభారతి, హుస్సేన్‌సాగర్ శుద్ధి, విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి.. అన్నింటినీ ఒకదాని వెంట ఒకటి పూర్తి చేద్దాం. అప్పుడే ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ వస్తుంది’’ అని సీఎం అధికారులతో తన మనోభావాలను పంచుకున్నారు.