
ఇక వేలాడే వంతెనలు!
- గోదావరి, కృష్ణాలపై కొత్త తరహా నిర్మాణానికి యోచన
- ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ నమూనాకు సర్కారు ఓకే
- జల రవాణా మార్గానికి తోడ్పడేలా నిర్మాణం
- ప్రయోగాత్మకంగా రెండు చోట్ల చేపట్టేందుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదులపై ఇక ముందు వేలాడే తరహా వంతెనలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ (బలమైన ఉక్కు తీగల సహాయంతో వేలాడే వంతెన)’ నమూనాలో తొలుత రెండు వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖమ్మం జిల్లా మణుగూరు-పర్ణశాల మధ్య గోదావరి నదిపై ఒక దానిని, కరీంనగర్-మానకొండూరు మధ్య మానేరుపై రెండో వంతెనను నిర్మించనుంది. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి డీపీఆర్‌లు పంపింది. మణుగూరు వద్ద వంతెనకు రూ.188 కోట్లు, కరీంనగర్ వంతెనకు రూ.122 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వంతెనల నమూనాలను కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అందం, సౌకర్యం కూడా..
ఇప్పటి వరకు ఈ తరహా వంతెనలను మన రాష్ట్రంలో నిర్మించలేదు. ‘ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్’ విధానంలో నది మధ్యలో ఎత్తుగా నిర్మించే స్తంభాలకు బలమైన ఉక్కు తీగలు ఏర్పాటు చేసి వంతెనను అనుసంధానిస్తారు. భవిష్యత్తులో గోదావరి, కృష్ణా నదుల్లో జల రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినందున... నావలు తిరిగేప్పుడు ఇబ్బంది కలుగకుండా ఈ తరహా వంతెనలు నిర్మించనున్నారు. ఇంతకుముందు కూడా దేశంలో జల రవాణా మార్గాలున్న చోట ఈ తరహా వంతెనలు నిర్మించారు. అందులో కోల్‌కతాలో హౌరా వంతెన, ముంబైలో సముద్రంపై నిర్మించిన కొత్త వంతెన పేరుపొందాయి.
ఈ తరహా వంతెనలు చూడడానికి అందంగా ఉంటాయి కూడా. ఖమ్మం జిల్లా పర్ణశాల పర్యాటక కేంద్రం. ఇక్కడికి నిరంతరం పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఇక ఈ ప్రాంతం నుంచి మణుగూరును అనుసంధానిస్తూ గోదావరిపై దాదాపు 1,600 మీటర్ల పొడవుతో భారీ వంతెన నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే మహారాష్ట్ర మీదుగా తెలంగాణ, ఏపీలను జలరవాణాతో అనుసంధానించాలని కేంద్రం నిర్ణయించినందున.. గోదావరిపై నిర్మించే వంతెనలన్నీ అందుకు వీలుగా ఉండేలా చూడాలని ఇప్పటికే ఆదేశించింది. దీంతో మణుగూరు వంతెనను కొత్త తరహాలో చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పర్ణశాలకు వచ్చే పర్యాటకులకు ఈ వంతెన కూడా చూడదగ్గ ప్రాం తంగా మారుతుందని భావిస్తున్నారు.
కరీంనగర్ సమీపంలో మరొకటి..
కరీంనగర్ నుంచి మానకొండూరు మీదుగా సాగే వరంగల్ రహదారిపై మరో వంతెన రూపొందనుంది. ఇప్పటికే ఈ మార్గంలో కరీంనగర్ పట్టణానికి చేరువగా నాలుగు వరసలతో ఓ వంతెన ఉంది. పురాతన రెండు వరసల వంతెననే పటిష్ట పరుస్తూ నాలుగు లేన్లకు విస్తరించారు. ఇప్పుడు దీనికి రెండున్నర కిలోమీటర్ల దిగువన సదాశివపల్లె వద్ద కేబుల్ డిజైన్‌తో రెండో వంతెనను నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. దాదాపు 800 మీటర్ల పొడవుతో నాలుగు లేన్లుగా ఉండే ఈ వంతెన నిర్మాణానికి రూ.122 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భవిష్యత్తులో మానేరు ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నందున.. ఈ వంతెన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.