ప్రతిష్టాత్మక ఉస్మానియా వర్సిటీలో ఓ ఇన్‌చార్జి ఉన్నతాధికారి లీలలు చూసి ప్రొఫెసర్లు విస్తుపోతున్నారు.
- విజిలెన్స్ పేరుతో బెదిరింపులు
- ఖరీదైన ఫోను, ఫర్నిచర్ కావాలంటూ హుకుం
- ఏకపక్ష నిర్ణయాలపై నిరసనలు
- ఓయూలో ఓ ఇన్‌చార్జి ఉన్నతాధికారి హల్‌చల్..
సాక్షి,సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక ఉస్మానియా వర్సిటీలో ఓ ఇన్‌చార్జి ఉన్నతాధికారి లీలలు చూసి ప్రొఫెసర్లు విస్తుపోతున్నారు. సదరు అధికారి బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే ఆయనగారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం ప్రొఫెసర్ల వైఖరిపై తీవ్ర ఆగ్రహంగా ఉందని, విజిలెన్స్ విచారణ జరుపుతోందని, పలువురు ప్రొఫెసర్ల ఫోన్లను ట్యాప్ చేస్తుందంటూ అధ్యాపకులకు గట్టిగా హెచ్చరికలు చేసి బెదిరింపులకు పాల్పడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు తనకు తాత్కాలికంగా వర్సిటీలో కీలకబాధ్యతలు అప్పగించినప్పటికీపూర్తిస్థాయి బాధ్యతల్లో ఉన్నట్లుగా ఆ మాస్టారు వ్యవహరిస్తుండడం గమనార్హం.
ఇటీవల పరిపాలన భవనంలో తన చాంబర్‌కు కొత్తసొబగులు అద్దాల్సిందేనని ఆయన హుకుం జారీచేసినట్లు తెలిసింది. పాత నిర్మాణాలను కూల్చివేసి కొత్తవి చేపట్టాలని,కొత్త ఫర్నిచర్ కొనుగోలుచేయాల్సిందేనంటూ ఫైనాన్స్ విభాగంపై ఒత్తిడిచేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన ఖరీదైన సెల్‌ఫోన్ కొనుగోలు చేసి తనకు కానుకగా ఇవ్వాలని ఆర్డరు వేయడం గమనార్హం.
ఇక పరీక్షల వాయిదాల విషయంలోనూ ప్రొఫెసర్లను,సంబంధిత విభాగాల అధ్యాపకులను సంప్రదించకుండానే ఏకపక్షంగా పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయడంతో అకాడమిక్ ఇయర్(వార్షిక విద్యాసంవత్సరం)ఆలస్యమౌతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇపుడే పరిస్థితి ఇలా ఉంటే..ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని వర్సిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.