సిటీలో సెమీఫైనల్
శీతవేళ... రాజకీయ వేడి
తలసాని రాజీనామాతో కొత్త సమీకరణలు
అందరి లక్ష్యం గ్రేటర్ ఎన్నికలే
ప్రతిష్ఠాత్మకం కానున్న ఉప ఎన్నికలు
సిటీబ్యూరో: శీతాకాలపు చలి గాలులకు దీటుగా సిటీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. నగర రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తలసాని రాజీనామా దీనిలో‘కీ‘లకం కానుంది. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా జీహెచ్‌ఎంసీ పాలక మండలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఓవైపు చర్చలు సాగుతున్నాయి. మరోవైపు టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో స్థానం పొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. ఆరు నెలల్లో తిరిగి అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగనుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉప ఎన్నికల్లో సనత్‌నగర్‌లో గెలుపు అన్ని పార్టీలకూ సవాల్‌గా మారనుంది. టీఆర్‌ఎస్ నుంచి మంత్రివర్గంలో చేరడంతో ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేయడం అనివార్యమైంది. ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకోవాలని వివిధ పార్టీలు భావిస్తున్నాయి. నగరానికి సంబంధించినంత వరకు అన్ని పార్టీల అసలు లక్ష్యం జీహెచ్‌ఎంసీ కాగా.. అంతకంటే ముందే జరుగనున్న ఉప ఎన్నికలు సెమీ ఫైనల్‌గా మారాయి. అందుకే వేటికవిగా అన్ని పార్టీలు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
గెలుపు సవాల్
గత అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి శ్రీనివాస్ యాదవ్ 56,475 ఓట్లతో టీడీపీ నుంచి గెలవగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి దండె విఠల్‌కు 29,014 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మర్రి శశిధర్ రెడ్డికి 23, 820 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెల్లాల. రామ్మోహన్‌కు 5,833, లోక్‌సత్తా అభ్యర్థికి 3,975 ఓట్లు లభించాయి. ఖాళీ అయిన ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నిక లో తలసాని సత్తా చాటుకోవడమేకాక... అధికార పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా భారీ మెజార్టీ సాధించాల్సి ఉంది. దాన్ని ఆయన సవాల్‌గా తీసుకుంటారనడంలో సందేహం లేదు.
అందరికీ ప్రతిష్ఠాత్మకమే
టీడీపీలోని పలువురు తలసాని వెంట వెళ్లడం ఆయనకు కలసివచ్చే అంశం. అధికార పార్టీ కారణంగానూ బలం మరింత పెరిగేందుకు ఆస్కారముంది. మరోవైపు సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న సనత్‌నగర్‌లో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే వ్యూహంలో టీడీపీ ఉంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఆ పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధం కానుంది. అంతేకాకుండా సనత్‌నగర్‌లో ఉన్న ఓటు బ్యాంకు వల్లే టీడీపీ గెలిచిందని... మైనార్టీల ఓట్లు బాగా ప్రభావం చూపాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీతో పొత్తు తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా టీఆర్‌ఎస్, టీడీపీలే కాక అన్ని పార్టీలూ సనత్‌నగర్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి. దీంతో ఇక్కడ ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా ఆసక్తికరం కానుంది.
పార్టీ మార్పుపై చర్చ..
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ 2004 ఎన్నిక ల సమయంలో టీడీపీలో చేరి ఆసిఫ్‌నగర్ నుంచి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయగా, ఓటమి ఎదురైంది. అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ, అంతకుముందు సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ నియోజకవర్గ ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. నాగేందర్‌కు టీడీపీ నుంచి గెలిచినప్పుడు 34, 001 ఓట్లు రాగా, ఎంఐఎంకు 31,227, కాంగ్రెస్‌కు 15,297 ఓట్లు లభించాయి. రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు ఎంఐఎం అభ్యర్థి మోజంఖాన్ గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయడంతో ఆనాటి ఘటనలను నగర రాజకీయ పండితులు మననం చేసుకుంటున్నారు.
జీహెచ్‌ఎంసీ పోరుకు...
అన్ని పార్టీల లక్ష్యం జీహెచ్‌ఎంసీ ఎన్నికలే కావడంతో ఆ దిశగా ఇప్పటి నుంచే పలువురు సిద్ధమవుతున్నారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ఇటేవలే ముగిసిన సంగతి తెలిసిందే. గత పాలక మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 52 మంది, ఎంఐఎం నుంచి 43, టీడీపీ నుంచి 45 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, ఎంబీటీ, పీఆర్‌పీల నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్లు ముగ్గురు కార్పొరేటర్లుగా గెలిచారు. పాలకమండలి గడువు ముగిసే నాటికి ఈ పార్టీల బలాబ లాలు మారాయి. బీజేపీ బలం 9కి చేరగా, టీడీపీ బలం 36కు తగ్గింది. కాంగ్రెస్ బలం కూడా 46కు తగ్గింది. పలువురు పార్టీలు మారడమే ఇందుకు కారణం. ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ నుంచి అసలు ప్రాతినిధ్యమే లేకపోగా... గడువు ముగిసే నాటికి ఆ పార్టీలో చేరిన కార్పొరేటర్లు దాదాపు 15 మంది ఉన్నారు. అలాగే బీజేపీ బలం దాదాపు సగం పెరిగింది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉండటంతో ఎన్నికల నాటికి ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.
కీలకం
సిటీబ్యూరో: ‘విశ్వ’నగరంగా అభివృద్ధి చెందే క్రమంలో వడివడిగా అడుగులేస్తున్న గ్రేటర్‌కుతాజా క్యాబినెట్ విస్తరణలోనూ అగ్ర తాంబూలమే దక్కింది. కేసీఆర్ క్యాబినెట్‌లో నగర నేతలకు కీలక శాఖలు కేటాయించడం విశేషం. ప్రభుత్వంలో ముఖ్యమైనవిగా పరిగణించే హోం, రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలను నగర నేతలు దక్కించుకోవడం గమనార్హం. టీడీపీ తరఫున సనత్‌నగర్ నుంచి గెలుపొంది, శాసనసభ సభ్యత్వానికి తాజాగా రాజీనామా చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కీలకమైన వాణిజ్య పన్నుల శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ దక్కింది. రాష్ట్ర ఖజనాకు కాసుల పంట పండించేకీలక శాఖ ఆయనకు దక్కడంపై సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రాచకొండలో చిత్రనగరి ఏర్పాటుపై కసరత్తును ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖను సైతం తలసానికి కట్టబెట్టడం ద్వారా ఆయనకు సముచితప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే నగరంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌కు క్యాబినెట్‌లో ముఖ్యమైన శాఖ కేటాయించి నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తొలి విస్తరణలోనే ఉపముఖ్యమంత్రి పదవితో పాటు, రెవెన్యూ, పునరావాసం, స్టాంపులు, యూఎల్‌సీ, రిజిస్ట్రేషన్ల శాఖలను మైనార్టీ నేత మహమూద్ అలీ దక్కించుకున్న విషయం విదితమే. కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి సైతం అప్పట్లోనే హోం, జైళ్లు, కార్మిక,సైనిక సంక్షేమం, ఉపాధికల్పన శాఖలను సొంతం చేసుకున్నారు. క్యాబినెట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న మరో నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు సర్కారుకు భారీగా ఆదాయం తెచ్చిపెట్టే ఆబ్కారీ శాఖతో పాటు క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను కట్టబెట్టడం ద్వారా గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తేటతెల్లమవుతోంది