గెలుపు తంత్రం... ‘గులాబీ’ మంత్రం
నగర చరిత్రలో తొలిసారిగా విపక్ష సభ్యుడికి స్థానం
నలుగురికి అమాత్య పదవులతో సామాజిక సమతూకం
వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మంత్రమే లక్ష్యం
ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామాపై తర్జనభర్జనలు
హైదరాబాద్: నగర రాజకీయాల్లో మంగళవారం ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. టీడీపీ తరఫున సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రెండు రోజుల క్రితమే క్యాబినెట్ బెర్త్ ఖరారు కావటంతో తలసాని నివాసం సోమవారం కిటకిటలాడింది. ఆయన అనుచరులు నగరాన్ని అభినందనల ఫ్లెక్సీలతో ముంచెత్తారు. 24 శాసనసభ స్థానాలు కలిగిన గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచింది కేవలం మూడు స్థానాల్లోనే. దీంతో పార్టీని పునాది నుంచినిర్మించాలనేది అధినేత కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగా టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తలసానికి క్యాబినెట్ పదవిని కట్టబెట్టారు. తద్వారా వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు భారం ఆయనపైనే మోపాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు సమాచారం.
సమతూకం
గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కుల,మతాల సమతూకంతో క్యాబినెట్ పదవుల పంపకం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే క్యాబినెట్‌లో మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీని డిప్యుటీ సీఎంగా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయిని నర్సింహారెడ్డిని హోంమంత్రిగా, గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావును ఎక్సైజ్ మంత్రిగా నియమించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంగళవారం క్యాబినెట్‌లో చేర్చుకోబోతున్నారు. దీంతో నగరంలో ప్రధాన సామాజిక వర్గాలన్నింటికీ ప్రాధాన్యమిచ్చినట్లవుతుందని టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే 1986లో జరిగిన మోండ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల నుంచిఉప్పు-నిప్పుగా వ్యవహరిస్తున్న తలసాని -పద్మారావుల మధ్య రాజకీయ సఖ్యత ఎలా కుదురుతుందన్న అంశం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. 1986లో మోండా డివిజన్ నుంచిపద్మారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా...జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన తలసాని ఓటమి పాలయ్యారు. అనంతరం సికింద్రాబాద్ శాసనసభ ఎన్నికల్లో ఇద్దరూ రెండుసార్లు తలపడి... చొరొకసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో ఇరువురు వేర్వేరు నియోకజవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించినా, ఇద్దరి మధ్య పాత వివాదాలు సమసిపోలేదు.
రాజీనామాపై తర్జన భర్జనలు
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి... టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తలసాని... ఒకటి, రెండు రోజుల్లో పదవికి రాజీనామా చేసి, మళ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చే సే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆర్నెళ్ల లోపు జరిగే ఎన్నికల్లో తలసానిని టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించి... గెలిచిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో టీఆర్‌ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం.