తెరపైకి మళ్లీ కృష్ణయాదవ్
గ్రేటర్ టీడీపీలో కృష్ణయాదవ్ పేరు మళ్లీ తెర మీదకు వచ్చింది. గ్రేటర్ అధ్యక్షుడుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ దిగి కారు ఎక్కుతుండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణయాదవ్ కు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి వరించింది,. తలసాని, తీగల కృష్ణారెడ్డి పార్టీకి దూరం కావటంతో వెనువెంటనే ఆయనకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. దాంతో తలసానికి గట్టిగా ఎదుర్కొనేందుకే కృష్ణయాదవ్కు అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
పాతబస్తీకి చెందిన కృష్ణయాదవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు విద్యార్థి నాయకుని నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లోహిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విప్గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నకిలీ స్టాంపుల కుంభకోణంలో 2003లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే కృష్ణయాదవ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు అధ్యక్షుడి అనుమతితో ఏడాదిన్నర క్రితం ఆయన టీడీపీలో చేరారు.
ఇక కృష్ణాయాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ ఒకే సారి శాసనసభలో కలిసి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీలో నగరం నుంచి బలమైన నాయకులుగా ముద్రపడ్డారు. అర్ధబలం, అంగబలంలోనూ వారిద్దరు సమఉజ్జీలే. అయితే ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం నెలకొంది. ఎంతలా అంటే ఒకరి నీడను మరొకరు సహించలేనంతగా.
ఆ తర్వాత నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని కృష్ణాయాదవ్ పార్టీ నుంచి బహిష్కృతుడు కావడంతో తలసానికి పార్టీలో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఓ దశలో తలసాని... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారారు కూడా. అనుకున్నది సాధించుకునేందుకు తలసాని పార్టీ మారే అస్త్రాన్ని కూడా పలుమార్లు ఉపయోగించుకున్నారు.