పల్లె ప్రజలకు ఐటీ పాఠాల కోసం కొత్త కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి ఇంటా ఓ వ్యక్తి సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో కనీస నైపుణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ లేదా ఏదైనా డిజిటల్ పరికరం ఉపయోగించి ఈ-మెయిల్స్ పంపడం, స్వీకరించడంతోపాటు కావాల్సిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో శోధించగలగాలి.
జాతీయ ఐటీ విధానం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటైన ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ (ఎన్‌డీఎల్‌ఎం)ను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రతి ఇంటా ఈ- సాక్షరత’ పేరుతో అమలు చేయనున్న ఈ పథకాన్ని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన పరస్పర అంగీకార పత్రంపై కేంద్ర ఐటీ శాఖ అధికారి దినేష్ కుమార్ త్యాగి, మీ సేవా తెలంగాణ రాష్ట్ర సంచాలకులు బి.శ్రీధర్ సంతకాలు చేశారు.
పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాలు ఎంపిక
పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని కోసం గజ్వేల్ (మెదక్), సూర్యాపేట(నల్లగొండ), సిరిసిల్ల (కరీంనగర్), అచ్చంపేట (మహబూబ్‌నగర్) మండలాలను ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో ఎన్‌డీఎల్‌ఎం శిక్షణ ఇవ్వనున్నారు. మండలానికి 7,500 మంది చొప్పున తొలిదశ కింద నాలుగు మండలాల్లో 30 వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రతి ఇంటా ఈ-సాక్షరత
Published Sun, Dec 21 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement