=పెన్‌డౌన్ మొదలు
=26, 27 తేదీల్లో సామూహిక సెలవులు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ ఎంసీ ఇంజినీరింగ్ విభాగం మొత్తం విధుల బహిష్కరణకు సిద్ధమైంది. గత శని, సోమవారాల్లో జరిగిన సర్వసభ్య సమావేశాల్లో తమ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని చేసిన దాడులు,హేళనకు నిరసన గా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో భాగంగా 24, 25 తేదీల్లో పెన్‌డౌన్, 26న సామూహిక ఆప్షనల్ లీవ్, 27న సామూహిక క్యాజువల్ లీవ్‌లకు శ్రీకారం చుట్టారు. అప్పటికీ తగిన హామీ లభించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కానున్నట్లు ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు ఎండి అబ్దుల్ రహ్మాన్, కె. కిషన్, తదితరులు మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు జీహెచ్‌ఎంసీ ‘ఫేస్ టు ఫేస్’ హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వసభ్య సమావేశాల్లో ఇంజినీరింగ్ విభాగాన్ని కించపరిచేలా వ్యవహరించారని, అజెండా మేరకు తామిచ్చిన లిఖితపూర్వక సమాధానాలను పక్కనపెట్టి, ఇంజినీరింగ్ విభాగాన్ని అవమానపర్చేలా విభాగం అధిపతి అయిన ఈఎన్‌సీపై దాడులకు దిగారని ఆరోపించారు. ప్రైవేట్ కన్సల్టెన్సీలకు పనుల అంశం వాస్తవానికి అజెండాలో 14వ అంశమైనప్పటికీ, కక్ష సాధించేందుకే ముందుకు జరిపి 10వ అంశంగా మార్చారన్నారు.
కన్సల్టెన్సీల నియామకాల్లో తమకెలాంటి ప్రయోజనాలు లేవని, ప్రభుత్వ విధానాల మేరకే వాటిని నియమించామని చెప్పారు. ఆమేరకు, జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదానికి లోబడే బడ్జెట్‌లో సైతం ప్రత్యేక అకౌంట్‌ను కేటాయించి నిధులు మంజూరు చేశారన్నారు. తామెదుర్కొంటున్న పలు సమస్యల గురించి ఎంతోకాలంగా అధికారులకు విన్నవించుకున్నా పరిష్కరించలేదన్నారు. పని ఒత్తిడితో జీహెచ్‌ఎంసీలో పనిచేసేందుకు కొత్త ఇంజినీర్లు ముందుకు రావడం లేదని, వచ్చినవారిలో సగానికి పైగా వెనుదిరిగారని చెప్పారు. తామెదుర్కొంటున్న సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈమేరకు తగిన హామీ లభించని పక్షంలో అసోసియేషన్ సమావేశంలో చర్చించి తదుపరి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఈఈలు చిన్నారెడ్డి, వేణుగోపాల్, మోహన్‌కుమార్, మోహన్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జీహెచ్‌ఎంసీ పన్వర్‌హాల్‌లో ఇంజినీర్లందరూ సమావే శమై తమపై జరుగుతున్న దాడుల్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఇంజినీర్ల పెన్‌డౌన్ సమ్మెతో మంగళవారం ఇంజినీరింగ్ కార్యాలయాల పనులు ఎక్కడివక్కడే స్తంభించాయి. బుధవారం నుంచి అన్ని పనులూ నిలిచిపోనున్నాయి.
సెలవుపై ఈఎన్‌సీ ..
శని, సోమవారాల్లో వరుస దాడులతోపాటు.. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సైతం ఈఎన్‌సీ ఇరవయ్యేళ్లుగా జీ హెచ్‌ఎంసీలో ఉన్నారని ప్రస్తావించడం తో కలతచెందిన ఈఎన్‌సీ ధన్‌సింగ్ దీర్ఘకాలిక సెలవుపెట్టారు. తనను బదిలీ చే యాల్సిందిగా కోరుతూ సోమవారమే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారని తెలిసింది.
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
ఇంజినీర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతిసే లా ప్రవ ర్తించిన కాంగ్రెస్, ఎంఐఎంలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని జీహెచ్‌ఎంసీలో బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్ ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు కన్సల్టెన్సీలకు పనులు అప్పగించడంపై రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎంఐఎంల వైఖరిని తప్పుబట్టారు. జీహెచ్‌ఎంసీలో అధికారకూటమిగా ఉండీ బడ్జెట్‌లోనే కన్సల్టెన్సీ సేవలకు నిధులు కేటాయించినప్పుడు ఆ పార్టీలు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు.
ఇంజినీర్ల ఉద్యమ బాట
Published Wed, Dec 25 2013 12:44 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement