
ఎత్తై జాతీయ జెండా గద్దె ఏర్పాటుకు జరుగుతున్న పనులు
20 రోజుల్లో దేశంలోనే అత్యంత ‘ఎత్తై’ జెండా సిద్ధం
జూన్ 2న ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి ‘ఎత్తయిన’ జాతీయ పతాకాన్ని తయారు చేయడంలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 20 రోజుల్లో అత్యంత ‘ఎత్తై’ జెండాను సిద్ధం చేసింది. గతంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. ఈ జెండా తయారీకి రెండు నెలలు పట్టిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
303 అడుగుల ఎత్తున ఈ జెండా ఏర్పాటు చేసే బాధ్యతను కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 14 విడి భాగాలుగా ఈ జెండా పోల్‌ను తయారు చేశారు. అయితే పౌర విమానయాన శాఖ అభ్యంతరం తెలపడంతో జెండా ఎత్తు తగ్గించనున్నట్లు తెలిసింది. దీంతో 299 అడుగులు లేదా 300 అడుగుల ఎత్తున జెండాను ఏర్పాటు చేస్తారు. దేశంలో ఇదే ‘ఎత్తై’ జెండా కావటంతో మరో అరుదైన రికార్డును తెలం గాణ సొంతం చేసుకోనుంది. జూన్ 2న ఉదయం 9.45 గం.కు సంజీవయ్య పార్క్‌లో సీఎం ఈ జెండాను ఆవిష్కరించనున్నారు.