జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా ఈవీఎంల పనితీరుపై
గచ్చిబౌలి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికలకు ముందు అన్ని పోలింగ్ స్టేషన్లలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలను పకడ ్బందీగా నిర్వహించేందుకు ప్రతి డివిజన్‌కు ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌కు గంట ముందు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం థర్డ్ సప్లిమెంట్ ఇచ్చిందని అందుకు అనుగుణంగా తొలగించిన ఓట్లు, కొత్తగా వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని ఓటర్ లిస్ట్‌కు జత చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జీహెచ్‌ంఎసీ పరిధిలో 7,751 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటి సంఖ్య 8 వేలకు పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో రెండు, మూడు డివిజన్లకు ఒక రిటర్నింగ్ అధికారి ఉండగా, ప్రస్తుతం ప్రతి డివిజన్‌కు ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
సరైన కారణం లేకుండా ఏక పక్షంగా ఎన్నికల విధులకు గైర్హాజరైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 5 జిల్లాల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నట్లు తెలిపారు. 28 మంది సాధారణ పరిశీలకులు, 24 మంది వ్యయ పరిశీలకులతో సహా 46 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారన్నారు. పోలింగ్ నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇస్తామని, పోలింగ్‌కు కొద్ది గంటల ముందే పే స్కేల్, హోదాను బట్టి ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియజేస్తామన్నారు. స్లిప్‌లను ఇంటింటికీ పంపిణీ చేస్తామని, వెబ్ సైట్‌లో ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే మూడు సెకన్లలో ఓటరు వివరాలు వస్తాయని, వారే స్లిప్ తయారు చేసుకునే వీలుందన్నారు.
12 వేల ఈవీఎంలు సిద్ధం..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 12 వేల వీఎంలు సిద్ధం చేసినట్లు జీహెచ్‌ంఎసీ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్ జనార్దన్‌రెడ్డి వివరించారు. ఇతర జిల్లాలు, మహరాష్ట్ర నుంచి ఈవీఎంలను తెప్పించామన్నారు. సమావేశంలో వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్ రెడ్డి, సర్కిల్-11 డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఏఎంసీ సురేందర్‌రెడ్డి, ఈఈ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లకు వారిదే బాధ్యత
ఎన్నికలకు ముందు మాక్‌పోలింగ్
విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు
8 వేలకు పెరగనున్న పోలింగ్ స్టేషన్లు
సిద్ధంగా 12 వేల ఈవీఎంలు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి