పండగజేసుకున్నారు..
మహా దోపిడీ {పత్యేక ఆదాయం రూ.10 కోట్లపైనే
10 వేలకుపైగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు
లక్షా 70 వేలు సొంత, ఇతర వాహనాలు
80 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో పయనం
145 ప్రత్యేక రైళ్లు రైల్వేకు రూ.5.1 కోట్లు..
ఆర్టీసీకి రూ.3.75 కోట్లు అదనపు ఆదాయం
{పైవేటు ఆపరేటర్ల ఆదాయం కోటికిపైగా..
{పయాణికుల జేబులు ఖాళీ
సిటీబ్యూరో: నగర వాసుల సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నా.. ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు ట్రావెల్స్ ముందుగానే పండుగ చేసుకున్నాయి. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి అదనపు చార్జీల పేరిట రూ.కోట్లు దండుకున్నాయి. మూడు రోజులుగా దాదాపు రూ.10 కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించాయి. ప్రయాణికుల జేబులు ఖాళీ అయ్యాయి. వారం రోజులుగా సంక్రాంతి సందడి మొదలైనా గత మూడు రోజులుగా నగరవాసులు పెద్ద ఎత్తున పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు కిటకిటలాడాయి. సిటీలోని నలువైపులా దార్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఈ మూడు రోజుల్లో 10 వేలకుపైగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, లక్షా 70 వేలకుపైగా సొంత వాహనాలు, ఇతర రకాల రవాణా వాహనాల్లో ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. రోజూ వివిధ ప్రాంతాలకు బయలుదేరే 80కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో వంద ప్యాసింజర్ ైరె ళ్లతోపాటు సంక్రాంతి, అయ్యప్ప రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే ఈసారి 145 ప్రత్యేక రైళ్లను నడిపింది. కొన్ని రైళ్లలో ప్రీమియం పేరుతో సాధారణ చార్జీలకంటే అధికంగా వసూలు చేసింది.
అంతా అ‘ధనమే’...
సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వేకు 20 శాతం అదనపు ఆదాయం లభించింది. ప్రయాణికుల రవాణా ద్వారా రోజుకు రూ.8.5 కోట్ల ఆదాయం వస్తోంది. పండుగ ప్రయాణాల దృష్ట్యా మూడు రోజులపాటు రోజుకు రూ.1.7 కోట్ల చొప్పున రూ.5.1 కోట్ల ఆదాయం దక్షిణమధ్య రైల్వే అదనంగా ఆర్జించింది. సాధారణ చార్జీలపైన 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసిన ఆర్టీసీ సైతం ‘పండుగ’ చేసుకొంది. హైదరాబాద్ నుంచి రోజూ బయలుదేరే 3,500 బస్సులతోపాటు సంక్రాంతి సందర్భంగా మరో 5,560 బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులకు 50 శాతం చార్జీలు ఎక్కువగా విధించింది. ఆర్టీసీకి రోజుకు వచ్చే ఆదాయం రూ.19 కోట్లు. పండుగ సందర్భంగా రోజుకు సగటున రూ.1.25 కోట్ల చొప్పున మూడు రోజులకు రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రైవేట్ బస్సుల వారు రెట్టింపు చార్జీలతో రూ.కోటికిపైగా అధికంగా దండుకున్నారు. మొత్తంగా రూ.10 కోట్లకుపైగా రవాణా సంస్థలు ఖజానా నింపుకోగా జనం జేబులు మాత్రం ఖాళీ అయ్యాయి.