వీఆర్‌వోల వింత కథ!
వీఆర్‌వోల వింత కథ!
Published Tue, Aug 8 2017 3:36 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తున్న ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: బెదిరింపులు.. వేధింపులు.. వసూళ్లు.. అన్నింటికీ గ్రామ రెవెన్యూ అధికారులే (వీఆర్వోలే) టార్గెట్లు! హోదా చిన్నదే.. చేయాల్సిన కీలక పనులెన్నో.. క్షేత్రస్థాయిలో ఏ పని చేయాలన్నా.. ఏ పథకం అమలు చేయాలన్నా భారం వారిపైనే.. దీంతో అవినీతి, అక్రమాలకు వీఆర్వోలే కేంద్రంగా మారుతున్నారు. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు అధికారులు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం వంటి వాటితో తాము అవినీతికి పాల్పడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని వీఆర్వోలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి కారణంగానే మానసిక ఒత్తిడికి గురై వరంగల్ జిల్లాకు చెందిన ఓ వీఆర్వో బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొంటున్నారు.
వసూళ్లకు టార్గెట్లు!
రెవెన్యూ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే క్రమంలో వీఆర్వోల వ్యవస్థ అవినీతి, అక్రమాల ఆరోపణలకు కేంద్రంగా మారుతోంది. భూముల వ్యవహారం కావడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించాల్సిన పరిస్థితుల్లో కొందరు వీఆర్వోలు లంచాలు తీసుకునే పరిస్థితి ఉండడం వివాదాస్పదంగా మారుతోంది. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు తహసీల్దార్లు ఏకంగా టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం, అన్ని స్థాయిల్లోనూ చేతులు తడపనిదే ఫైళ్లు కదిలే పరిస్థితి లేకపోవడంతో తామూ అవినీతిలో కూరుకుపోవాల్సి వస్తోందని వీఆర్వోలు వాపోతున్నారు.
పైఖర్చులు కూడా..
తన పరిధిలోని ప్రతి వీఆర్వో వారానికి రూ.2 వేల చొప్పున ముట్టచెప్పాలని హైదరాబాద్ జిల్లాలోని ఓ తహసీల్దార్ టార్గెట్ పెట్టినట్లు తెలిసింది. గ్రామాల్లో ప్రోటోకాల్ ఖర్చులను వీఆర్వోలే భరిస్తున్నారు. ఎమ్మెల్యేల కార్యక్రమాల నుంచి స్థానికంగా జరిగే అన్ని కార్యక్రమాల ఖర్చులను పెట్టుకోవాలని వీఆర్వోలకు తహసీల్దార్లు హుకుం జారీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
అసలు పని వదిలేసి..
ఏటా భూముల వివరాల్లో మార్పులు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగయిందనే వివరాల నమోదుతోపాటు. జనన, మరణ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నివేదికలు ఇవ్వాలి. కానీ వీఆర్వోల వ్యవస్థ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే వారి జాబ్‌చార్ట్ పూర్తిగా మారిపోయింది. తహసీల్దార్లు తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల అమలు వీఆర్వోల నెత్తినే పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీంతో క్లస్టర్ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 67 రకాల విధులు, సంక్షేమ పథకాల అమలును చూసుకోవాల్సి రావడం వీఆర్వోలకు భారంగా పరిణమించింది. ఇక రాష్ట్రంలో వీఆర్వోల కొరత కారణంగా దాదాపు వెయ్యి మందికిపైగా వీఆర్వోలు మరో రెవెన్యూ గ్రామానికి ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది.
సౌకర్యాలు సున్నా..
వీఆర్వోల పనుల జాబితా చాంతాడంత ఉన్నా సౌకర్యాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో కనీసం ఒక కార్యాలయం అంటూ లేకపోవడం గమనార్హం. గ్రామాలకు వచ్చిపోతున్నా.. ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. ఇక నివేదికలకు అయ్యే స్టేషనరీ ఖర్చులు, గ్రామాలు, మండలాలు తిరిగేందుకు అయ్యే ప్రయాణ భత్యాల వంటివేవీ వీఆర్వోలకు అందడం లేదు. పైగా కొందరు పై అధికారులు ‘వసూళ్ల’ టార్గెట్లు కూడా పెడుతుండటంతో లంచాల బాట పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పనిచేయడం కష్టంగా మారింది
‘‘మా పని చాలా కష్టంగా తయారైంది. మోయలేనంత పనిభారం, అధికారుల ఒత్తిడులు నైరాశ్యానికి గురిచేస్తున్నాయి. మాకు రెవెన్యూ పనులు మాత్రమే అప్పగించాలి. గ్రామస్థాయిలో కనీస వసతులు కల్పించాలి. అన్ని రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించాలి. ఈ సమస్యలపై అన్ని సంఘాలతో కలసి త్వరలోనే సీఎస్‌ను కలుస్తాం..’’
– గోల్కొండ సతీశ్, తెలంగాణ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు
Advertisement