హన్మకొండ అర్బన్: జిల్లాలో వీఆర్వోల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు వరంగల్ అర్బన్ జిల్లా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలో ముందు వరుసలో ఉండి అవార్డు కోసం పోటీపడుతుంటే.. మరోవైపు అవినీతి, అక్రమాల విషయంలో వీఆర్వోలపై కుప్పలు తెప్పలుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఏం చేయాలో ఉన్నతాధికారులకు దిక్కు తోచడం లేదు. చిన్నాచితకా ఘటనలు వదిలేసినా.. ప్రస్తుతం భారీ భూకుంభకోణంగా వెలుగు చూసిన ఎల్కతుర్తి అక్రమాల ఘటనతో జిల్లా అధికారులు క్రమశిక్షణ చర్యల విషయంలో కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో జిల్లాలోన ?వీఆర్వోలను మూకుమ్మడిగా బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రెవెన్యూ వర్గాల్లో ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.
జిల్లాలోనే బదిలీలు..
ప్రస్తుతం అర్బన్ జిల్లాలో మొత్తం 126 వీఆర్వో పోస్టులు ఉండగా.. 96 మంది పనిచేస్తున్నారు. అయితే ఉన్నవారిలో మూడోంతుల మందిపై లిఖిత పూర్వక ఫిర్యాదులు, విచారణ నివేదికలు ఉన్నతాధికారుల వద్ద సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఒకరిద్దరిపై వేటు వేసేకన్నా పెద్ద మొత్తంలో వీఆర్వోలను బదిలీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉన్నవారిలో కనీసం 50 మందికి తగ్గకుండా స్థానచలనం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తహసీల్దార్ల పైనా..?
రికార్డుల ప్రక్షాళన విషయంలో జరిగిన అక్రమాలు, అందుతున్న ఫిర్యాదులు కేవలం వీఆర్వోలపైనే కాకుండా కొన్నిచోట్ల తహసీల్దార్ల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తహసీల్దార్ల వద్ద ఉండాల్సిన డిజిటల్ కీ విషయంలో ఉద్దేశ పూర్వకంగా కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం చేసినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎల్కతుర్తి తహసీల్దార్‌పై చర్యలకు ఆదేశించగా.. మిగతా వారి విషయంలో ఏం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే తహసీల్దార్ల ప్రమేయం లేకుండా వీఆర్వోలు మాత్రమే అక్రమాలకు పాల్పడుతున్నారనడాన్ని వారు తప్పుపడుతున్నారు. అధికారుల ప్రమేయం లేకుండా వీఆర్వో ఒక్కరే ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఉన్నతాధికారులు ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో ఆసక్తిరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment