ఆన్ లైన్ డెలివరీ ఉద్యోగుల వద్ద బ్యాగ్ నుకాజేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకై వస్తువులను బుక్ చేసి మోసపోయే వారు కొందరైతే ఆ కంపెనీ ఉద్యోగులను ఆర్డర్ పేరుతో ఇంటికి రప్పించి వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను కాజేస్తున్న ఓ కేటుగాడిని వనస్థలిపురం పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, డీఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని తణుకు ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కొడుకు సురేష్ (26) కొద్ది రోజులుగా వనస్థలిపురంలో నివాసముంటున్నాడు.
ఇతను మొదట ఆన్‌లైన్‌లో వస్తువులను తప్పుడు చిరునామాతో బుక్ చేసేవాడు. వారు ఆర్డర్ తీసుకుని వచ్చాక తాను ఇంటిపైన ఉన్నానని పార్శిల్ తీసుకుని రావాలని ఉద్యోగికి చెప్పేవాడు. ఇతని మాయమాటలు నమ్మిన ఉద్యోగులు వారి బ్యాగును కింద బైకు మీద ఉంచి పైకి వెళ్లేవారు. ఈ లోగా కిందనే ఉన్న సురేష్ కంపెనీ ఉద్యోగి బ్యాగ్‌ను ఎత్తుకుపోయేవాడు. ఈ విధంగా జూలై 27న నాగార్జునకాలనీలో, ఆగస్టు 8న కమలానగర్‌కాలనీలో నాప్‌టాల్, షాపింగ్‌జోన్ అనే ఆన్‌లైన్ సంస్థల ఉద్యోగులను బ్యాగ్‌లను ఎత్తుకుపోయాడు. ఆ ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు సురేష్ నుంచి రూ.2 లక్షల 20వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.