
‘జల జలా’ పనులు!
జంట జలాశయాల పరిరక్షణకు సన్నద్ధం
డీపీఆర్ తయారీకి దరఖాస్తుల ఆహ్వానం
నివేదిక తయారీకి రూ. 18 లక్షలు
సిటీబ్యూరో: నగర దాహార్తిని తీరుస్తున్న చారిత్రక జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు మంచి రోజులు రాబోతున్నాయి. వీటి పరిరక్షణకు జలమండలి ముందుకొచ్చింది. సమీప గ్రామాలు, రిసార్టులు, కళాశాలలు, వాణిజ్య సముదాయాల మురుగు నీటితో జలాశయాలు ఆర్గానిక్ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. ఆలస్యంగా కళ్లు తెరిచిన బోర్డు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో ఈ జలాశయాలు హుస్సేన్ సాగర్‌లా కాలుష్యం బారిన పడకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఆసక్తి, అనుభవం గల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకోసం రూ. 18 లక్షలు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించి, తద్వారా వచ్చే నిధులతో జలాశయాలు పది కాలాల పాటు మనుగడ సాగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జలమండలి నిర్ణయిచింది.
మురుగు నుంచి విముక్తి ఇలా...
జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, గ్రామ పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీటిని ఎక్కడికక్కడే భారీ సెప్టిక్ ట్యాంకులు నిర్మించి తాత్కాలికంగా నిల్వ చేస్తారు. అక్కడి నుంచి వ్యర్థ జలాలను సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ల ద్వారా మినీ మురుగు శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ శుద్ధిచేసిన నీటిని సమీప పంట పొలాలకు మళ్లించడంద్వారా జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నది జలమండలి లక్ష్యం.
నివేదికలో ఉండాల్సిన అంశాలివే..
జంట జలాశయాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు.ఎగువ, సమీప ప్రాంతాల నుంచి మురుగు నీరు జలాశయాల్లోకి చేరకుండా రింగ్‌సీవర్ మెయిన్ (భారీ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణం) ఏర్పాటు. మురుగు నీటి శుద్ధికి మినీ ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాల గుర్తింపు. జలాశయాల సరిహద్దులను గుర్తించడం. జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జి.ఒ. ఉల్లంఘనలు, తీసుకోవాల్సిన చర్యలు. జలాశయాలకు రక్షణ కంచె ఏర్పాటు. చేపల వేట నిషేధం, ఇతర మానవ సంబంధ కార్యకలాపాలపై నిషేధం.