డబుల్ బెడ్రూం ఇళ్లపై పునరాలోచించండి
♦ బడ్జెట్‌పై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
♦ గ్రామాల్లో పేదలు తమ స్థలంలోనే ఇళ్లు కట్టుకునేలా వెసులుబాటు కల్పించాలి
♦ సీతారామ, రామదాసు ప్రాజెక్టులపై సందేహాలున్నాయ్
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లను ఒకేతీరుగా నిర్మించాలనే ప్రణాళికపై ప్రభుత్వం పునరాలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. హైదరాబాద్‌లో ఒకే నమూనా అమలుకు ఇబ్బంది లేదని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో తమకున్న స్థలంలో పేదలు ఇళ్లు కట్టుకునేలా వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. దాదాపు నాలుగులక్షల మందికి పెండింగ్‌లో పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కరువు, దుర్భిక్ష పరిస్థితులు, ఎండలు మండుతున్నందున రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు భరోసానివ్వాలని ఆయన సూచించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీ వేసి ఈ నిధులు ఖర్చు చేయాలని, మైనారిటీలు, బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానం మేరకు ప్రతి గిరిజన కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులపై పలు సందేహాలు ఉన్నాయని, వాటిపై నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్లపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా 51శాతం ప్రణాళిక వ్యయాన్ని చూపిం చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలో.. జాలిపడాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. భారీగా వేసుకున్న ఆదాయపు అంచనాలన్నీ ప్రభుత్వ ప్రగల్భాలుగానే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.