డ్రగ్స్ తర్వాత ఇదే అతిపెద్ద వ్యాపారం
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న మానవ అక్రమ రవాణా
- రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను నియంత్రిస్తున్నాం
- 2014 నుంచి ఇప్పటివరకు 1,397 మందిని రక్షించాం
- మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవంలో డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో డ్రగ్స్ తర్వాత స్థానంలో మానవ అక్రమ రవాణా ఉందని డీజీపీ అనురాగ్ శర్మ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా నేతృత్వంలో పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల హక్కులు, వేధింపుల నియంత్రణకు కృషిచేస్తున్న మహితా, ప్లాన్ ఇండియా సంస్థల ప్రతినిధులు, ప్రాసిక్యూషన్ విభాగం అధికారులు కలసి పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఐడీ ఆధ్వర్యంలో వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నామని, ఇప్పటివరకు 953 అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని, 1,397మంది మహిళలు, యువతులను రక్షించామని తెలిపారు.
వ్యభిచార కూపాల నుంచి బయటపడ్డ వారికి సరైన ఆధారం కల్పించి, ఆదాయ మార్గాలు చూపిస్తే మళ్లీ వ్యభిచార వృత్తిలోకి వెళ్లకుండా ఉంటారని, దీనిపై పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సీఐడీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వేలాది మంది బాలకార్మికులను తల్లిదండ్రుల చెంతకు పంపించామని, బాలలతో పనిచేయిస్తున్నవారిపై పీడీ యాక్ట్ పెంట్టేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాను నియంత్రించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. కాగా, ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిన మానవ అక్రమ రవాణా సమస్య తక్కువగా ఉందని డీజీపీ వెల్లడించారు.
మరింత సామర్థ్యం పెంచుకోవాలి...
మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు, న్యాయవాదులు మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐజీ సౌమ్యామిశ్రా అభిప్రాయపడ్డారు. వ్యభిచార కూపాలు, బాలకార్మిక వ్యవస్థ, అవయవాల అక్రమ రవాణా, బలవంతపు భిక్షాటన.. ఇలా అనేక రకాలుగా కొందరు వ్యక్తులు మహిళలు, చిన్నారులను వేధిస్తున్నారని, వీరికి కఠినమైన శిక్షలు పడాలంటే పోలీసులు, న్యాయవాదులు సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహితా స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, ప్లాన్ ఇండియా స్వచ్చంద సంస్థ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అనితా కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణుడు సుధామురళీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్‌రావు, యునిసెఫ్ ప్రతినిధి డేవిడ్ రాజ్, సీఐడీ అధికారులు పాల్గొన్నారు.
బాధితులుగా చూడాలి
రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ వ్యభిచార గృహాల నుంచి మహిళలను బాధితులుగా గుర్తించి కాపాడాలని, వారిని నిందితులుగా చూడవద్దని పోలీస్ అధికారులకు సూచించారు. వారు ఈసడింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందని గుర్తుచేశారు.