
'చంద్రబాబు వికృత రూపం ఇలా ఉంటుంది'
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వికృతరూపం ఎలా ఉంటుందో రోజా సస్పెన్షన్ ఘటన చూసి ప్రజలంతా అర్థం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వికృతరూపం ఎలా ఉంటుందో రోజా సస్పెన్షన్ ఘటన చూసి ప్రజలంతా అర్థం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వాస్తవానికి శాసనవ్యవస్థ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం కూడదని ఎప్పటినుంచో అంటున్నారని, కానీ నిబంధనలకు వ్యతిరేకంగా సస్పెండ్ చేసినప్పుడు కోర్టులు చాలా సందర్భాల్లో జోక్యం చేసుకొని తీర్పులిచ్చాయని, వాటిని సభలు ఆమోదించాయని చెప్పారు.
కోర్టు ఆదేశాల అనంతరం సభకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చిన రోజాను అడ్డుకోవడంపట్ల ఆయన స్పందిస్తూ ప్రతిపక్షంపై చంద్రబాబునాయుడు వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కోర్టులు తీర్పులు ఇచ్చాయని, వాటిని సభలు గౌరవించాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం స్పీకర్, ముఖ్యమంత్రి మాత్రం వాటిని గౌరవించడం లేదని, వ్యక్తిగత కక్షను పెంచుకున్నారని అన్నారు. ఈ వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతం కాదని చెప్పారు.
రోజాను చంద్రబాబు శాసనసభలో చూడకూడదు కాబట్టే చట్టాలను, న్యాయాన్ని కూడా ధిక్కరిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. గతంలోనూ సీఎంగా, ప్రతిపక్షనేతగా వ్యవహరించిన వ్యక్తి విచక్షణా జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వాదనాలన్నీ విన్న తర్వాతే న్యాయమూర్తి తన ఉత్తర్వులు ఇచ్చారని, వాటిని గౌరవించాలని చెప్పారు. చంద్రబాబు వికృతరూపం ఇలా ఉంటుందని దీనిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరారు.