ప్రభుత్వ వైఫల్యాలపై మూడు నెలల ఉద్యమం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాబోయే మూడు నెలల పాటు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. వ్యవసాయ రంగ సమస్యలతో పాటు దళిత, ఇతర సామాజిక వర్గాలకు సరైన న్యాయం జరగకపోవడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోవడం, ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించడం, పేదలకు రెండు పడకల ఇళ్లు సుదూర స్వప్నంగా మారడంపై ఉద్యమించనున్నట్లు తెలిపారు.
గురువారం బద్దం బాల్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, కృష్ణసాగర్‌రావుతో కలసి లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలోనే బీజేపీ బృందాలు మార్కెట్ యార్డులను సందర్శిస్తాయని, అనంతరం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వంపై ఒత్తిడిని తెస్తామని చెప్పారు. వాస్తు పేరిట ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టేందుకు రూ.350 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. దసరా తర్వాత అసెంబ్లీని నిర్వహిస్తామని సీఎం చెప్పారని, ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. రాజ్యాంగ విలువలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. వెంటనే శీతాకాల సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దిగ్విజయ్‌వి పిచ్చి ప్రేలాపనలు..
సైన్యం రక్తాన్ని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి వాడుకుంటోందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు పిచ్చిప్రేలాపనలు, చౌకబారు విమర్శలని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వేల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం చూసి దిగ్విజయ్, కాంగ్రెస్‌కు దిమ్మతిరిగి తమ అసహనాన్ని ఇలా బట్టబయలు చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అథమ స్థానంలోకి చేరుకోవడాన్ని జీర్ణించుకోలేక బీజేపీపై ఇలాంటి విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. దిగ్విజయ్, ఇతర కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలతో సైనికుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు.