ఆపద్బంధు పథకానికి నిధుల కొరత వేధిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో అర్హులను ఎంపిక చేసినా..
ఆదుకోని ‘ఆపద్బంధు’
నిధుల మంజూరులో అలసత్వం
పేద కుటుంబాలకు అందని సాయం
సిటీబ్యూరో: ఆపద్బంధు పథకానికి నిధుల కొరత వేధిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో అర్హులను ఎంపిక చేసినా.. సాయం అందడం లేదు. నిరుపేద కుటుంబాల్లో పోషించే వ్యక్తి (ఇంటి యాజమాని) ప్రమాదవశాత్తూ చనిపోతే... మిగిలిన వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2013-14 సంవత్సరానికి జిల్లాలో 82 కుటుంబాలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. వీరికి రూ.41 లక్షలు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం రూ.27 లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఈ మొత్తం 54 కుటుంబాలకు పంపిణీ చేశారు. మిగిలిన వారికి నిరాశే మిగిలింది. ఈ పథకం ద్వారా సాయం పొందేందుకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంతో పాటు నాంపల్లి, సికింద్రాబాద్‌లలోని ఆర్డీఓ కార్యాలయాలు, అబిడ్స్‌లోని కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధిత కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదీ అంతేనా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2014-15) ఈ పథకం పరిస్థితి అలాగే ఉంది. దరఖాస్తుల పరిశీలన, మంజూరు వంటి అంశాలపై ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేవు. బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు వీటిని ఏం చేయాలనే సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటి వరకు తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీ ఓ50 దరఖాస్తులు అందినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా... మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారులు వీటిని పరిశీలించే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆపద్బంధు పథకం కింద తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు.