నేడు ఢిల్లీకి మంత్రి కేటీఆర్
► కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై రక్షణ మంత్రితో చర్చ
► విదేశాంగ మంత్రి సుష్మతో భేటీ.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌తో బుధవారం సమావేశం కానున్నారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేత నిర్ణయంపై పునఃపరిశీలన జరపాలని పరీకర్‌ను కోరనున్నారు. కంటోన్మెంట్ రోడ్లను మూసివేయాలని రక్షణ శాఖ నిర్ణయించడంతో ఆ రోడ్లపై నిత్యం రాకపోకలు సాగించే లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రత్యామ్నాయ రోడ్లను నిర్మించే వరకు కంటోన్మెంట్ రోడ్ల మూసివేత నిర్ణయాన్ని వారుుదా వేయాలని కోరనున్నారు. కేటీఆర్‌తోపాటు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.
ప్రవాస భారతీయుల సమస్యలపై..
మరోవైపు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సమావేశమై ప్రవాస భారతీయుల రక్షణకు సంబంధించిన అంశాలను కేటీఆర్ ప్రస్తావిస్తారు. గల్ఫ్‌కు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. మరుసటి రోజు కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రిని కలసి రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు అంశంపై చర్చిస్తారు. పర్యటనలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్‌లను కూడా కలవనున్నారు. గురువారం ఫ్రెంచ్, స్వీడెన్ ఎంబసీ ప్రతినిధులను కేటీఆర్ కలవనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.