రాష్ట్రంపై జ్వరాల పంజా! | Toxic fever cases in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంపై జ్వరాల పంజా!

Published Sun, Jul 24 2016 1:24 AM | Last Updated on Sat, Sep 15 2018 8:23 PM

రాష్ట్రంపై జ్వరాల పంజా! - Sakshi

రాష్ట్రంపై జ్వరాల పంజా!

- విషజ్వరాలు, సీజనల్ వ్యాధుల బారిన ఐదున్నర లక్షల మంది
- హైదరాబాద్ పరిధిలోనే లక్ష మందికిపైగా బాధితులు
- కబళిస్తున్న మలేరియా,డెంగీ, చికున్‌గున్యా
- విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు, అంటు రోగాలు
అపరిశుభ్రత, దోమలే కారణం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని విష జ్వరాలు, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు కబళిస్తున్నాయి.. రోజురోజుకూ పెద్ద సంఖ్యలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి.. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు వీటి బారినపడి బెంబేలెత్తుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ విష జ్వరాల బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదున్నర లక్షల మంది జ్వరాల బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి.ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఇప్పటివరకు 1,284 మలేరియా, 188 డెంగీ, 15 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయని అంచనా. వర్షాకాలం మొదలైనా పట్టణ, పల్లె ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడం.. దోమల స్వైర విహారంతో పరిస్థితి మరింత విషమిస్తోంది. నీటి కాలుష్యంతో విరేచనాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు లేకపోవడంతో పట్టణాలు, పల్లెల్లోని రోగులు వైద్యం కోసం పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

 హైదరాబాద్‌లోనే అత్యధికం...
 రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది లక్ష మందికిపైగా జ్వరాల బారినపడ్డారు. అందులో ఎక్కువగా గత రెండు నెలల్లోనే నమోదైనట్లు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 68 డెంగీ, 75 మలేరియా, ఒక చికున్‌గున్యా, 30కిపైగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు వస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రోజూ వందలాది మంది పిల్లలు విష జ్వరాలతో నీలోఫర్ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ సంఖ్య సాధారణం కంటే మూడింత లు ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే పిల్లలకు చికిత్స చేసేందుకు అవసరమైన మౌలిక వసతులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీజనల్ వ్యాధుల తీవ్రత పెరిగిందని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. పారిశుద్ధ్య లోపంతో విరేచనాలు, అంటువ్యాధుల తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి మురికివాడలు దుర్గంధం వెదజల్లుతున్నాయని, దీంతో తాగునీరు కలుషితమై విషజ్వరాలు విజృంభిస్తున్నాయని అంటున్నారు. ఇక హైదరాబాద్‌వ్యాప్తంగా అనేకచోట్ల పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

 ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ..
  విష జ్వరాలతో చికిత్స కోసం వస్తున్న బాధితులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తున్నాయి. సాధారణ చికిత్సతో నయం చేసే అవకాశమున్నా ప్లేట్‌లె ట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య 10 వేల లోపునకు తగ్గితేనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. అంతకుమించి ఉంటే అవసరం లేదు. కానీ 20 నుంచి 50 వేల వరకు ప్లేట్‌లెట్లు ఉన్న వారికి కూడా రిస్క్ ఎందుకంటూ ప్లేట్‌లెట్‌లు ఎక్కిస్తున్నారు. చివరికి వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.
 
 నాలుగైదింతలు పెరిగిన జ్వరం కేసులు
 సాధారణ రోజుల్లో మా ఆసుపత్రికి ఐదారు జ్వరం కేసులు వచ్చేవి. ఇప్పుడు సరాసరి 30 వరకు జ్వరం కేసులు వస్తున్నాయి. సీజనల్ జ్వరాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత విస్తరించే ప్రమాదం ఉంది. విషజ్వరాల్లో సాధారణంగా ఎక్కువ ఫీవర్ ఉంటుంది. రెండు మూడు రోజులు అలాగే ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రధానంగా నీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం లోపించడం, దోమల కారణంగా విషజ్వరాలు, మలేరియా, డెంగీ ప్రబలుతాయి. పరిశుభ్రత ముఖ్యం..
 - డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం
 
 సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి
 రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. నిలోఫర్‌కు వచ్చే పిల్లల్లో ప్రస్తుతం జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య పెరిగింది. సాధారణ రోజుల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడుతున్నాం..              
- డాక్టర్ లాలూప్రసాద్, ఆర్‌ఎంవో, నిలోఫర్ ఆసుపత్రి
 
 ప్రబలకుండా చర్యలు చేపట్టాం
 సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తమయ్యాం. క్లోరిన్ టాబ్లెట్లు, బ్లీచింగ్ పౌడర్‌లను జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. తాగునీటి గొట్టాలు, నల్లాలను మరమ్మతులు చేయించేలా చర్యలు చేపట్టాం. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాష్ట్రంలో విషజ్వరాల తీవ్రత పెద్దగా లేదు..
 - డాక్టర్ జి.సుబ్బలక్ష్మి, అంటువ్యాధుల విభాగం జేడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement