టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ మారితే...
హైదరాబాద్: టికెట్ ఖరారు చేసిన తర్వాత కూడా నామినేషన్ వేయకుంటే... టికెట్ ఇచ్చిన తర్వాత ఆ అభ్యర్థి మరో పార్టీలోకి మారితే... ఈ భయాలతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఆ కారణంగానే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటించడానికి ఆ పార్టీ నాయకత్వం భయపడుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శనివారం జోరుగా నామినేషన్ల దాఖలయ్యాయి. నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించగా, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలు ఈ విషయంలో వెనకబడ్డాయి. అధికారికంగా అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల ఇబ్బందులు రావొచ్చన్న అనుమానంతో ప్రతిపక్ష పార్టీలు జాబితాలను ప్రకటించడం లేదు.
అధికారికంగా అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం వల్ల టీఆర్ ఎస్ నుంచి ఒత్తిడి పెరిగి నామినేషన్ వేస్తారో లేదో, అలాంటి వారిని రంగం నుంచి ఉపసంహరించడానికి ఒత్తిడి పెరుగుతుందన్న అనుమానాలతో జాబితాను ప్రకటించలేదని తెలంగాణ పీసీసీ నాయకుడొకరు చెప్పారు. అధికారికంగా జాబితా ప్రకటించనప్పటికీ ఫోన్లలో అందించిన సమాచారం మేరకు దాదాపు మెజారిటీ డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్ వేశారని ఆ నేత తెలిపారు.
మరో చిక్కు
అధికారికంగా ప్రకటించని కారణంగా కొన్ని డివిజన్లలో ఇద్దరిద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిప్పుడు కాంగ్రెస్ కు కొత్త సమస్యను తెచ్చి పెడుతోంది. అధికారిక అభ్యర్థిగా ఒకరిని ఖరారు చేసి బి ఫామ్ ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థి రెబల్ గా రంగంలో నిలుస్తారన్న ఆందోళన కూడా కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా, 21 తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. రెబల్ గా రంగంలోకి దిగుతారని అనుమానం ఉన్న అభ్యర్థులతో సంప్రదింపులు జరపడంపై ఇప్పుడు నేతలు సమాలోచనలు చేస్తున్నారు.