వచ్చే వారమే టీపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్
- వివిధ శాఖల్లో 1,998 ఇంజనీర్ పోస్టుల భర్తీ
- త్వరలోనే మిగతా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
- కమిషన్ సమావేశంలో నిర్ణయం!
- గ్రూప్స్ సిలబస్‌పైనా విస్తృత స్థాయిలో కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ వచ్చే వారమే జారీ కానుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. శుక్రవారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి (ఐ అండ్ క్యాడ్), పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని పోస్టులను ఇంజనీరింగ్ సివిల్ అర్హతతో, కొన్నింటిని సివిల్ లేదా మెకానికల్ అర్హతలతో, మరికొన్నింటిని ఏఎంఐఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, డిప్లొమా అర్హతలతో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇండెంట్లు, రోస్టర్ కమ్ రిజర్వేషన్, అర్హతల వివరాలను టీఎస్‌పీఎస్సీ ఆయా శాఖల నుంచి తెప్పించుకుంది. నాలుగైదు రోజులపాటు కసరత్తు చేసి పరీక్షల విధానం, పూర్తిస్థాయి సిలబస్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. వీటన్నింటిపై మరోసారి పరిశీలన జరిపి వచ్చే వారంలో (20వ తేదీలోగా) నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో రెండు కేటగిరీలకు చెందిన 1,998 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనంతరం వివిధ కేటగిరీల్లోని చిన్న చిన్న పోస్టులు, పదోతరగతి, ఇంటర్, ఐటీఐ వంటి అర్హతలతో ఉండే ఇతర పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీచేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
అలాగే గ్రూప్-1, 2, 3 పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి సిలబస్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిని త్వరలోనే పూర్తిచేసి, ఈ సిలబస్ ప్రకారం విద్యార్థులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా (ప్రిపేర్ అయ్యేలా) అవకాశం కల్పించనుంది. ఈ లెక్కన అక్టోబర్ నాటికి గ్రూప్-2, డిసెంబర్ నాటికి గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశముంది. అప్పటిలోగా కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తే... ఆయా కేటగిరీల్లో వచ్చే పోస్టులతో పాటు ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులను కలిపి భర్తీ చేయనున్నారు.