చైన్‌స్నాచర్ల భరతం పట్టండి
పారిపోయే అవకాశం ఇవ్వొద్దు
ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్‌కు సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
సిటీబ్యూరో: చైన్ స్నాచర్లు కనిపిస్తే చాలు పట్టుకొని తీరుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వనస్థలిపురం ఆటోనగర్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు చైన్‌స్నాచర్లు చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న నేపథ్యంలో ‘ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్’కు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన బుధవారం దిశా నిర్దేశం చేశారు. చైన్‌స్నాచర్ల కనిపించినప్పుడు వారిని పట్టుకునే విధానంలో మెళకువలతో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా స్పందిచడంపై పాఠాలు చెప్పారు. ఫీల్డ్‌లో వారికి ఉన్న సందేహాలనూ నివృత్తి చేశారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సీసీటీమ్స్ చేసిన బైక్ విన్యాసాలు, రివాల్వర్ వాడే తీరు కళ్లకు కట్టింది. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంతో పోల్చుకుంటే చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే హింస తీవ్రత పెరిగింది. ఓయూలో సుమిత్ర అనే మహిళ మరణించింది. చాలా మంది మహిళలు గాయపడ్డారు. అందుకే శ్రుతిమించుతున్న చైన్‌స్నాచర్లను నిలువరించాలంటే వారి తరహాలోనే పోలీసు టీమ్స్ ఉండాలని భావించాం. ఫీల్డ్‌లోనే గుర్తిస్తే చైన్ స్నాచింగ్‌లను తగ్గించవచ్చనే ఆలోచనల నుంచి యాంటీ చైన్ స్నాచింగ్ స్ట్రాటజీ కార్యరూపం దాల్చింది’’ అని ఆనందర్ అన్నారు.
ఐదంచెల ప్రణాళికతో చెక్...
‘‘చైన్ స్నాచింగ్ జరిగిన తర్వాత అరగంట, గంటకు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, అప్పటికే మూడు నాలుగు ప్రాంతాల్లో గొలుసు చోరీలు జరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయో గుర్తించి అందుకు అనుగుణంగా 110 మందితో 55 సీసీటీమ్స్ రెడీ చేశాం. చైన్ స్నాచర్లను పట్టుకునే మెళకువలతో పాటు బైక్‌ను వేగంగా నడపడం, నియంత్రించడంపై శిక్షణ ఇప్పించాం. ఒకవేళ స్నాచర్లు ఆయుధాలతో దాడికి యత్నిస్తే ఆత్మరక్షణ కోసం కాల్పులు ఎలా జరపాలో కూడా ప్రత్యేక తర్ఫీదునిచ్చాం’’ అని కమిషనర్ చెప్పారు.
అంతరాష్ట్ర చైన్‌స్నాచర్ల ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటికే ఏడు ప్రత్యేక బృందాలు రెడీ చేశాం. స్నాచర్లను పట్టుకునేందుకు ఆ బృందాలు వారణాసి, మహారాష్ట్రలకు వెళ్లాయి. ఇతర రాష్ట్రాల్లోని చైన్ స్నాచర్ల వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. స్థానిక స్నాచింగ్ ముఠాలపై నిఘా వేసేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే గొలుసు దొంగల పూర్తి సమాచారం సేకరించాం. ఆఫీసు రికార్డుల్లో పూర్తిగా అప్‌డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యాం. సీసీటీమ్స్, లోకల్ పోలీసు అధికారుల ఫోన్‌లో చైన్‌స్నాచర్ల ఫొటోలతో పాటు వివరాలు ఉండేలా యాప్ రెడీ చేస్తున్నాం.
గతంలో మాదిరిగా రోటీన్ చెకప్ కాకండా స్థానిక పోలీసులు ఎక్కడపడితే అక్కడ వాహనాల తనిఖీలు చేసేలా చూస్తున్నాం. డైనమిక్ బీట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోని పార్కింగ్ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నాం. స్నాచింగ్స్‌పె ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తయారుచేసిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఇతర నేరాలు కూడా జరిగే విధానాన్ని వివరిస్తూ రెడీ చేసిన పోస్టర్లను అన్ని ప్రాంతాల్లో అతికించేలా చొరవ తీసుకుంటున్నామని కమిషనర్ ఆనంద్ చెప్పారు.