ట్రాపింగ్ | Trapping | Sakshi
Sakshi News home page

ట్రాపింగ్

Published Tue, Feb 3 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

ట్రాపింగ్

ట్రాపింగ్

‘పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇళ్లు లూటీ’.. ‘అర్ధరాత్రి దొంగల బీభత్సం’..  ‘పట్టపగలు దోపిడీ’... నగరంలో ఇలాంటి వార్త లేని పత్రిక ఉండదు. ఎన్ని తాళాలేసినా జరిగే దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అందరికీ సెక్యూరిటీ వాళ్లని పెట్టుకునే స్తోమత ఉండదు. ఉన్నా... వాళ్లను చంపిమరీ దోచుకెళ్తున్నారు దొంగలు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీ రంగంలోకి దిగింది. అదే ‘బర్గ్‌లర్ అలారమ్ సిస్టమ్’. దొంగ నీడ కూడా వాకిట్లో
 పడకుండా కాపాడుతున్న లేటెస్ట్
 టెక్నాలజీ గురించి వివరంగా...
 ..:: భువనేశ్వరి
 
 
 హైటెక్‌సిటీలోని ఒక ఇండిపెండెంట్ ఇంటికి అర్ధరాత్రి పన్నెండు తర్వాత దొంగలొచ్చారు. డూప్లెక్స్‌హౌస్ కావడం వల్ల కింద అంతస్థు తలుపుల్ని బ్రేక్ చేస్తే ఎవరైనా చూస్తారేమోనని కాంపౌండ్‌వాల్ సాయంతో పైకి వెళ్లి తలుపుని పగలుగొట్టే ప్రయత్నం చేశారు. ఇంట్లోవాళ్లకి చప్పుడు వినిపించి లోపలి నుంచి గట్టిగా అరవడం, తెలిసినవారికి ఫోన్లు చేయడం వంటివి చేశారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు రావడంతో దొంగలు గోడ దూకి పారిపోయారు. పన్నెండు సమయంలో కొందరైనా మెలకువగా ఉంటారు కాబట్టి మేల్కొని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదే ఏ రెండు, మూడు గంటలకో అయితే సులువుగా దొంగలు ఇంట్లోకి చొరబడేవారు. ‘సెక్యూరిటీవారిని పెట్టుకోవాలా?, గుర్ఖా సర్వీసు తీసుకోవాలా?’ అని ఆ ఇంటి యజమాని మర్నాడు ఆలోచిస్తుండగా ఎవరో బర్గ్‌లర్ అలారమ్ సిస్టమ్ గురించి చెప్పారు. దాని ప్రయోజనాలు తెలిసి టెక్నాలజీని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో రాత్రివేళలో ఎవరు అడుగుపెట్టినా యజమానికి, వారి స్నేహితులకి కాల్ వెళ్లిపోతుంది. ఎవరొచ్చారో తెలుసుకోవాలంటే మొబైల్లోని వీడియో డోర్ ఫోన్ యాప్ ఓపెన్ చేసి చూడొచ్చు.
 
 ఎలా పనిచేస్తుంది....
 ఫోన్లలో వేసుకునే సిమ్‌ల మాదిరిగా మీ ఇంటిపరిసరాల్లో కొన్ని సెన్సర్లను అమరుస్తారు. వాటి సాయంతో కాంపౌండ్‌వాల్, లోపలిప్రదేశాల్లో బరువుపడిన వెంటనే మన ఫోన్‌కి మెసేజ్, కాల్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. ఇంటికి, ఐదు సెల్‌ఫోన్లకు మేసేజ్ వచ్చేలా ఈ యాప్ ఉంటుంది. అవసరమైనవాళ్లు వీడియోడోర్ ఫోన్ అనే యాప్‌ని కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల తలుపుని టచ్ చేయగానే ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ యాప్‌ని ఓపెన్ చేస్తే తలుపు దగ్గరున్న మనిషిని చూడొచ్చు. పూర్వం సెన్సర్లు పిల్లి, కుక్క వచ్చినా అలర్ట్ చేసేవి. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఇంత బరువు అని సెట్ చేసుకునే అవకాశం దొరికింది.
 
 మేసెజ్, కాల్ వస్తుంది...
 ఈ టెక్నాలజీ వచ్చి ఆరేడేళ్లవుతున్నా దీని ఉపయోగాల గురించి జనానికి పెద్దగా తెలియడం లేదంటారు ‘స్టార్క్ ఇంటర్నేషనల్’ కంపెనీ యజమాని మహేందర్‌రెడ్డి. ‘నేను మూడేళ్లక్రితం ఈ కంపెనీ పెట్టాను. దాదాపు వంద ఇళ్లకు పైగా ‘బర్గ్‌లర్ అలారమ్ సిస్టమ్’ని అమర్చాను. వీటిలో అరవైశాతం ఇండిపెండెంట్ ఇళ్లే. ముఖ్యంగా కాలనీలో ఉండే ఇళ్లకు సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రివేళలోనే కాదు పట్టపగలు కూడా దొంగతనాల ఘటనలు అనేకం. అలాంటివాటికి చెక్ పెట్టడానికి పుట్టిందే ఈ ‘బర్గ్‌లర్ అలారమ్ సిస్టమ్’ దీని వల్ల మీ కాపౌండ్‌వాల్‌లో ఎవరు అడుగుపెట్టినా వెంటనే మీ సెల్‌ఫోన్స్‌కి మెసేజ్ వచ్చేస్తుంది. కాల్ కూడా వస్తుంది. వెంటనే మీరు అలర్ట్ అలారమ్ ఆన్‌చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌పై అవగాహన పెరగాల్సి ఉందని చెప్పారు మహేందర్‌రెడ్డి.
 
 ఆస్పత్రుల్లోనూ...
 ఈ యాప్‌ని ఇళ్ల కాపలాకే కాకుండా కొన్ని ఆసుపత్రుల్లో కూడా వాడుతున్నారట. ఆస్పత్రుల్లో డాక్టర్‌ని కలవడానికి పేషెంట్లు క్యూలు కడుతుంటారు. వారిని తన గది నుంచి చూసే అవకాశాన్ని కోరుకుంటున్నారు కొందరు డాక్టర్లు. అందుకే హాస్పిటల్ హాల్స్‌లో సెన్సర్లను అమర్చుకుంటున్నారు. ‘మేమింతవరకూ ఎనభైఇళ్లకు ఈ సెన్సర్లను అమర్చాం. ‘బర్గ్‌లర్ అలారమ్ సిస్టమ్’ పనిచేయడం వల్ల దొంగల్ని పట్టుకున్న ఘటనలు ఉన్నాయి’ అని అంటున్నారు క్రియేటివ్ ఇన్‌స్ట్రూమెంట్ కంపెనీకి చెందిన రమేష్. దొంగల్ని ఇంటిదరిదాపులకు కూడా రాకుండా కాపాడుతున్న ‘బర్గలర్ అలారమ్ సిస్టమ్’ మరింత మందికి
 ఉపయోగపడాలని కోరుకుందాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement