ప్రజల్లోకి వెళదాం!
► నవంబర్ మొదటి వారంలో ప్రత్యేక సమావేశం..
హాజరుకానున్న జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు
► దాదాపు నాలుగు వేల మందికి
ఒక రోజు ఓరియెంటేషన్
► తుది దశకు జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు
► కార్యవర్గాల ప్రకటన తర్వాత బస్సు యాత్రలు
► తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్ అధినాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. కొత్త జిల్లాలతో పెద్ద సంఖ్యలో కొత్త కార్యవర్గాలు ఏర్పడుతున్నందున వారికి అవగాహన కల్పించేం దుకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక అధికార టీఆర్‌ఎస్ సంస్థాగత కమిటీల నియామకంపై కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే పలు జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలసి చర్చించుకుని సీఎం కేసీఆర్‌కు జాబితాలు అందజేశారు. సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేశాక అనుబంధ సంఘాల కమిటీలతో పాటు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని క మిటీలను నవంబర్ మూడు, నాలుగు తేదీల్లో ప్రకటిస్తారని... ఆ తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టిపెడతారని తెలుస్తోంది.
దాదాపు 4 వేల మందితో..
జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటయ్యాక వారందరితో సీఎం కేసీఆర్ ఒక రోజు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మొత్తంగా 31 జిల్లాల నుంచి సుమారు 3,500 మందితోపాటు గ్రేటర్ హైదరాబాద్, కార్పొరేషన్ల కమిటీలతో కలిపి దాదాపు 4 వేల మంది తో సీఎం కేసీఆర్ సమావేశమై దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. ప్రతీ జిల్లా కమిటీలో 24 మందికి అవకాశం కల్పించనుండగా.. 9 అనుబంధ సంఘాలకుగాను ఒక్కో సంఘం లో 10 మంది చొప్పున 90 మంది ఉంటారు. ఈ లెక్కన ఒక్కో జిల్లా నుంచి 114 మంది సీఎం సమావేశానికి హాజరు కానున్నారు. వారందరికీ ప్రభుత్వం చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తారని... వారు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
నవంబర్ నుంచే బస్సు పర్యటనలు
త్వరలోనే జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారని, నవంబర్ నెలలోనే రెండు మూడు జిల్లాలకు బస్సు పర్యటనలు నిర్వహిస్తారని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 2వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించాలన్న అంశంపైనా పార్టీలో ప్రాథమికంగా చర్చ జరిగిందని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్ అవతలే ఈ సభ ఏర్పాటు చేసే అవకాశముందని తెలిపాయి. అనంతరం సీఎం కేసీఆర్ మరికొన్ని జిల్లాల పర్యటనలు చేస్తారని సమాచారం. వాస్తవానికి దీపావళి ముందు రోజే పార్టీ కమిటీలను ప్రకటించాలని టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం భావించినా... ఎంపిక ప్రక్రియ కొంత క్లిష్టంగా మారడంతో నవంబర్ 3, 4, 5 తేదీల్లో కమిటీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో సమావేశాలు పూర్తి కాకపోవడంతో ఇంకా కొన్ని జాబితాలు అందలేదని సమాచారం.
పార్టీ పదవుల తర్వాతే ‘నామినేటెడ్’
పార్టీలోని అన్ని స్థాయిల్లో కమిటీలను భర్తీ చేశాకే ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 18 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. మరికొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు సహా సభ్యులను నియమించాల్సి ఉంది. ముందుగా పార్టీ పదవుల వ్యవహారం తేలాకే అధికార పదవుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌బ్యూరో ఏర్పాటుపైనా గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం ఇద్దరు మంత్రులు, ఒక సీనియర్ నేతతో కమిటీ కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది.