విధేయులకు అందలం | TRS govt announce to nominate posts to TRS leaders | Sakshi
Sakshi News home page

విధేయులకు అందలం

Published Mon, Oct 10 2016 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

విధేయులకు అందలం - Sakshi

విధేయులకు అందలం

గులాబీ నేతలకు నామినేటెడ్ పదవులతో సర్కారు దసరా కానుక
తొమ్మిది కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
టీఎస్‌ఐఐసీ చైర్మన్‌గా జి.బాలమల్లు
కుడా చైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయం... నేడు ఉత్తర్వులు

 
సాక్షి, హైదరాబాద్:
నామినేటెడ్ పదవుల కోసం రెండున్నరే ళ్లుగా ఎదురుచూస్తున్న టీఆర్‌ఎస్ నేతలకు దసరా కానుక అందింది. 2001 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను పదవుల అదృష్టం వరించింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వరంగ సంస్థ(కార్పొరేషన్)లకు చైర్మన్లను నియమిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లా నుంచి నలుగురు, నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి ఒక్కొక్కరికీ అవకాశం కల్పించారు. ముఖ్యమైన టీఎస్‌ఐఐసీ చైర్మన్‌గా మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన జి.బాలమల్లుకు అవకాశం కల్పించారు.

వరంగల్ జిల్లాకు చెందిన కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ను గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా, పెద్ది సుదర్శన్‌రెడ్డిని పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా, మర్రి యాదవరెడ్డిని కాకతీయ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) చైర్మన్‌గా, లింగంపల్లి కిషన్‌రావును వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (ఆగ్రోస్) చైర్మన్‌గా ఎంపిక చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన మందుల సామేల్‌ని గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా, బండ నరేందర్‌రెడ్డిని అడవుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా, కరీంనగర్ జిల్లాకు చెందిన ఈద శంకర్‌రెడ్డిని నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎ.వెంకటేశ్వరరెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమించారు.
 
ఈ నియామకాల ఉత్తర్వులు సోమవారం వెలువడనున్నాయి. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఆశించి భంగపడిన వారికి ఈ నియామకాల్లో అవకాశం కల్పించారు. అలాగే తొలి నుంచీ పార్టీని నమ్ముకుని విధేయులుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు అవకాశాలు పొందలేకపోయినవారికి ఈసారి నామినేటెడ్ పదవుల పంపకాల్లో అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement