ఘనంగా కాకా 87వ జయంతి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి(కాకా) 87వ జయంతి వేడుకలను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న వెంకటస్వామి విగ్రహానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ కార్మికులు, దళితజాతి కోసం కాకా ఎనలేని కృషిచేశారన్నారు.
ఆయన చేసిన సేవలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. షేర్వానీ దుస్తులతో హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పెంపొందించారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ స్వరాష్ట్రకాంక్షను కాకా బలంగా కోరుకున్నారనీ, అందుకు పోరాటం చేశారనీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దళితుల ఉన్నత విద్యకోసం అంబేడ్కర్ విద్యాసంస్థలను నెలకొల్పి మార్గదర్శనం చేశారన్నారు.
రాజకీయాల్లో తనకు కాకా తండ్రిలాంటి వారని ఎంపీ కె.కేశవరావు కొనియాడారు. కార్మికశాఖ మంత్రిగా కాకా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కాకా సహకారం వల్లే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని ఎంపీ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో వెంకటస్వామి కుమారులు మాజీ మంత్రి జి.వినోద్, మాజీ ఎంపీ జి.వివేక్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని వెంకటస్వామి కుటుంబసభ్యులు శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ కాకా అభిమానులు నినాదాలిచ్చారు.