2022 అక్టోబర్‌లోనూ యాక్సిడెంట్ బారిన దినేష్ గిరి
అప్పట్లో తీవ్రగాయాలతో బతికి బయటపడిన వైనం
‘లంగర్‌హౌస్ దుర్ఘటన’లో భార్యతో సహా మృతి
మోన కుటుంబంలోనూ విషాద ఘటనలు
సాక్షి, సిటీబ్యూరో/లంగర్‌హౌస్: మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లోని మిలటరీ వాటర్ ట్యాంక్ వద్ద చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యాభర్తలు మోన ఠాకూర్, దినేష్ గిరిలను యాక్సిడెంట్స్ వెంటాడాయి. మోన కుటుంబంలో ఇద్దరు ప్రమాదాల బారినేపడి మృతి చెందగా..దినేష్‌ను రెండేళ్ల క్రితం ఓ ‘నిషా’చరుడు ఢీ కొట్టాడు. అప్పట్లో తీవ్రగాయాలతో బయటపడినా..ఇప్పుడు మరో మందుబాబు డ్రైవింగ్‌కు భార్యతో సహా అశువులుబాశారు. మోన ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, తల్లిని కోల్పోవడంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు.
అప్పుడు బతికిపోయినా ఇప్పుడు...
బంజారాహిల్స్‌కు చెందిన దినేష్ గిరికి, ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త నుంచి విడిపోయిన లంగర్‌హౌస్‌కు చెందిన మోన ఠాకూర్‌కు 2022లో వివాహం నిశ్చయమైంది. ఆ ఏడాది అక్టోబర్ 6న దినేష్ తన ద్విచక్ర వాహనంపై ట్యాంక్‌బండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లక్డీకాపూల్ ప్రాంతంలో మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన పవన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. వాటిలో ఓ వాహనంపై ఉన్న దినేష్ కు ముఖం, తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడ్డారు. అప్పటికీ వివిధ సర్జరీల కారణంగా పూర్తిగా కోలుకోవడానికి ఏడు నెలలు పట్టింది. దీంతో మోనతో జరగాల్సిన పెళ్లి ఆలస్యమై... 2023 మే 25న ఒక్కటయ్యారు.
ఆమె కుటుంబంలోనూ విషాదాలెన్నో...
లంగర్‌హౌస్ పెన్షన్‌పురకు చెందిన మోన ఠాకూర్ కుటుంబంలోనూ విషాదాలు ఎన్నో ఉన్నాయి. ఈమె తండ్రి భగవాన్ సింగ్ మొదటి భార్య ఇందిర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రెండో భార్య రత్నభాయికి పుట్టిన సంతానమే మోన. మొదటి భార్య కుమారుడు బచ్చన్ (మోన సవతి సోదరుడు) వెల్డింగ్ పనులు చేస్తూ జీవించే వారు. 2007 మేలో తన సమీప బంధువుతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తతో సహా మోన కన్నుమూసింది. ఆ సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, బంధువులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు.
సొంత తండ్రి వద్ద దొరకని ప్రేమ దినేష్ వద్ద...
మోనకు మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు. ప్రేరణ శ్రీ (12) తొమ్మిదో తరగతి, ధ్రితి శ్రీ (9) ఐదో తరగతి చదువుతున్నారు. ఒకేసారి రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో వీళ్లు అనాథలుగా మారారు. తమ సొంత తండ్రి నిత్యం గొడవలు పడేవాడని, తమను వేధించేవాడని ఈ చిన్నారులు చెబుతున్నారు. దినేష్ గిరి సవతి తండ్రి అయినప్పటికీ..సొంత బిడ్డల్లా ప్రేమగా చూసుకునేవాడని చెప్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. తాము తల్లిదండ్రులతో కలిసి గడిచిన 18 నెలల్లో ఎన్నో సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చామని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కడకు వెళ్లినా తమను తీసుకునే వెళ్లేవారని, అయితే పరీక్షల కారణంగా ఇటీవల గోవా వెళ్లలేకపోయామని చెప్తున్నారు. దీంతో గోవా నుంచి వచ్చిన రోజే తాము కోరడంతో ఆహారం తేవడానికి వెళ్లి కన్నుమూశారని బాధగా చెప్తున్నారు.
ప్రణయ్‌ను పోలీసు కస్టడీకి కోరాం
లంగర్‌హౌస్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు ప్రణయ్‌ను అరెస్టు చేశాం. ఆదివారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టే సమయానికి మత్తు నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం కూడా తనకు తెలియదని, మద్యం మత్తులో ఏమి చేశానో తెలియదని చెబుతున్నాడు. స్నేహితులతో కాకుండా తాను ఒక్కడినే మద్యం తాగానని చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరాం.
– కె.రఘుకుమార్, లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment