క్రాస్ ఓటింగ్ జరగకుండా చర్యలు
- ఒక్క చెల్లని ఓటు నమోదు కాకుండా తర్ఫీదు
- ఆదివారం ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్
- అందుబాటులో నిబంధనలు, సూచనల కాపీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ పార్టీకి చెందిన ఒక్క ఓటు క్రాస్ కాకుండా, అదే మాదిరిగా ఒక్క ఓటూ మురిగిపోకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ప్రధానంగా టీఆర్‌ఎస్ నుంచి కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారి ఓట్లు తమ అభ్యర్థి మీరాకుమార్‌కే పడతాయని కాంగ్రెస్ నాయకులు పదేపదే చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో గులాబీ అధినాయకత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఏడాదిన్నర కిందట ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికల బరిలో నిలిచిన తెలంగాణ టీడీపీ అభ్యర్ధి వేం నరేందర్‌రెడ్డి కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటును కొనుగోలు చేసి, క్రాస్ ఓటింగ్ చేయించేందుకు ప్రయత్నించారు. ఏసీబీకి రేవంత్ పట్టుబడడంతో క్రాస్ ఓటింగ్ కుట్ర బట్టబయలు అయ్యింది. అయితే, మరికొందరు ఎమ్మెల్యేలు సైతం టీడీపీ నేతలతో మంతనాలు జరిపారని ప్రచారం జరిగింది. స్టీఫెన్‌సన్ వ్యవహారంతో అంతా భగ్నం కావడంతో వారి పేర్లు బయటకు రాలేదు. కానీ, ఆ ఎమ్మెల్యేలు ఎవరనే విషయంలో పార్టీ అధినేతకు కొంత సమాచారం ఉందన్న ప్రచారమూ పార్టీ వర్గాల్లో జరిగింది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో అలాంటి ‘సీన్ రిపీట్’ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓటింగ్‌పై అవగాహన
రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం చెల్లని ఓట్లు నమోదు అవుతున్న ఉదంతాలను పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ ఓట్లన్నీ చెల్లే విధంగా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని టీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే శాసనసభ సచివాలయం నుంచి ఎన్నికల నిబంధనలు, ఓటు వేసేప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో కూడిన కాపీలు ఎమ్మెల్యేలకు పంపించారని సమాచారం. దీంతో పాటు ఆదివారం తెలంగాణ భవన్‌లో ఒక గంట పాటు ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యేలకు ఇదే తరహాలో అవగాహన కల్పించా రు. టీఆర్‌ఎస్‌కు చెందిన 90 మంది ఎమ్మెల్యేల ఓట్లవిలువ 11,880, 17 మంది ఎంపీల ఓట్ల విలువ 11,968. వెరసి మొత్తం విలువ 23,848. కాగా, ఎంపీలు అంతా ఢిల్లీలోనే తమ ఓట్లు వేయనున్నారని, ఒక రోజు ముందుగానే ఢిలీకి చేరుకోవాలని అధినాయకత్వం వారిని ఆదేశించిందని చెబుతున్నారు.
ఇవీ.. జాగ్రత్తలు
► ప్రతీ ఓటరు తమ ప్రాధాన్య ఓటును అభ్యర్థి పేరు ఎదురుగా గడిలో 1 అంకెను ఉంచడం ద్వారా వేయాలి.
► ప్రాధాన్యాన్ని కేవలం అంకెలలో (1) మాత్రమే సూచించాలి.
పదాలలో (ఒకటి అని) సూచిస్తే అది చెల్లని ఓటు అవుతుంది.
► తమ ప్రాధాన్యాన్ని గుర్తించడానికి టిక్ (రైట్ గుర్తు), ఇంటు (రాంగ్ గుర్తు) వాడొద్దు.
► పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ సమకూర్చిన పెన్నునే వినియోగించాలి.
► ఓటును కచ్చితంగా రహస్యంగానే ఉంచాలి. నిబంధన ఉల్లంఘిస్తే అది చెల్లదు.
► బ్యాలెట్ పేపర్‌పై పేర్లు, పదాలు రాయడం, ఓటరు తన సంతకం చేయడం కూడదు.
► బ్యాలెట్ పేపర్ చిరిగినా, పాడైనా కొత్త బ్యాలెట్ ఇవ్వరు.