హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అవసరమైన పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ నెల 22న జరిగే ఈ పరీక్షకు జిల్లా కేంద్రాలు, డివిజన్లలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,618 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నిర్వహణ బాధ్యతలను కలెక్టర్లు, డీఈవోలకు అప్పగించింది. ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను, లెక్చరర్లను నియమించేందుకు చర్యలు చేపట్టింది. వాస్తవానికి మే 1వ తేదీనే జరగాల్సిన టెట్‌ను ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3.72 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 22వ తేదీన ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుంది.
అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఫలితాలను జూన్ 1న విడుదల చేస్తారు. అభ్యర్థులంతా ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేలా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ పరీక్షకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అత్యధికంగా 64,030 మంది నిరుద్యోగులు టెట్ పేపర్-1, పేపర్-2 రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే అత్యధికంగా 277 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక మొత్తంగా పేపర్-1 రాసేందుకు 99,993 మంది, పేపర్-2 రాసేందుకు 2,72,137 మంది దరఖాస్తు చేసుకున్నారు.