'కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలు రెండూ సమానమే'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... తెలంగాణలో జెన్కో ప్రాజెక్టును నల్గొండ జిల్లా దామరచర్లలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఆ ప్రాజెక్టును గ్రీనరీతో పరిరక్షిస్తామని వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్నారు.
మార్చి 27వ తేదీన ధూళిపల్లి, నారపల్లి పారెస్ట్లను సందర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం చేసేందుకే భూసేకరణ బిల్లు తెచ్చామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన కుట్రలో భాగంగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దోషిగా నిలవాల్సి వస్తుందని ప్రకాశ్ జావదేకర్ ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పర్యావరణానికి ఇచ్చే అనుమతులన్నీ పెండింగ్లో ఉన్నాయని ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు.