అమ్మాయిలూ.. అబ్బాయిల్లా బైక్‌పై దూసుకెళ్లాలంటే ఎన్నో ఆంక్షలు. ఈ పరిస్థితిలో ఇప్పుడు కొంచెంమార్పొచ్చినా ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇక 1990 ప్రాంతంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో సొంతంగా బైక్ డ్రైవింగ్‌నేర్చుకొని, మరెంతో మందికినేర్పిస్తూ ముందుకెళ్తున్నారు నగరవాసి నిర్మల.
హిమాయత్‌నగర్: నిర్మలకు ఇద్దరు పిల్లలు. వారిని స్కూల్ తీసుకెళ్లి, ఆఫీస్‌కు వెళ్లే సరికి ఆలస్యమవుతోందని భర్త కోప్పడేవాడు. ‘నీకు కనీసం బండి కూడా రాదు..’ అంటూ హేళన చేసేవాడు. దీనికి ఎలాగైనా సమాధానం చెప్పాలనుకున్న నిర్మల.. అవసరాన్ని చాలెంజ్‌గా తీసుకొని ఇంట్లో ఎవరికీ తెలియకుండా కెనటిక్ హోండా బైక్‌పై ఓ 10రోజులు ప్రాక్టీస్ చేసి, సొంతంగా డ్రైవింగ్ నేర్చుకుంది. ఫర్‌ఫెక్ట్ అయ్యాక భర్త, బంధువుల ఎదుట నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పూజారి మాటతో...
డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నిర్మల కొత్త బైక్ కొనుగోలు చేశారు. పూజ చేయించేందుకు గుడికి వెళ్లగా ‘అమ్మా.. డ్రైవింగ్ రాక ఇంట్లో మాటలు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వారికి నేర్పిస్తే బాగుంటుంది కదా’ అని పూజారి ఆమెతో అన్నారు. ఆ మాట నిర్మల మనసులో నాటుకుపోయింది. దానికి కట్టుబడి ‘సాయి డ్రైవింగ్ స్కూల్’ పేరుతో మహళల కోసం ప్రత్యేకంగా బైక్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. 1997లో ప్రారంభమైన ఈ స్కూల్లో ఇప్పటి వరకు 3వేలకు పైగా మంది బైక్ నేర్చుకున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు.. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 వరకు డ్రైవింగ్ నేర్పిస్తారు.
ఫీలింగ్ హ్యాపీ..
బైక్ డ్రైవింగ్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇతరులను సాయం కోరేకన్నా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని... కష్టంతో ఇష్టపడి నేర్చుకున్నాను. ఇప్పుడు నేనే మరొకరి నేర్పించే స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. సిటీలో ఫస్ట్ లేడీస్ టూవీలర్ డ్రైవింగ్ స్కూల్ నాదే అయినందకు గర్వంగా కూడా ఉంది. – నిర్మల
చార్జీలు ఇలా..
ఇక్కడ పాతకాలం బైక్‌ల నుంచి ఆధునిక బైక్‌ల వరకు అందుబాటులో ఉన్నాయి. కెనటిక్ హోండాపై నేర్చుకోవాలంటే రూ.2,800, హోండా యాక్టివాపై అయితే రూ.3,800 చొప్పున చార్జీ చేస్తారు. శిక్షణ సమయంలో ఆర్టీఏ రూల్స్‌ని వివరిస్తూ నేర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment