రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు
హైదరాబాద్ : హేవిళంబి తెలుగునామ సంవత్సరం సందర్భంగా మంగళవారం ఉగాది వేడుకలు రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆయన కొద్దిసేపు అనంతరం వెళ్లిపోయారు.
అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని, కేటీఆర్, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత‍్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులకు గవర్నర్ నరసింహన్ శాలువతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తెలుగువారు కాకపోయినా ఘనంగా నూతన సంవత్సరం వేడుకలను జరిపారని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గవర్నర్ వచ్చినప్పటి నుంచి రాజ్‌భవన్ కళకళలాడుతోందని, అందరికి మంచి జరుగుతుందని పంచాగకర్త చెప్పారని, పాలకులకు మంచి పాలన అందించేలా, రైతులకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.