రెండు తెలుగు రాష్ట్రాలు.. సమృద్ధి సాధించాలి
సాక్షి, హైదరాబాద్: ‘హేవళంబి సంవత్సరం తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలి. రెండు రాష్ట్రాలు సమృద్ధిని సాధించాలి. ఇక్కడ రాజ్‌భవన్‌లో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. పాడి పంటలు, వర్షాలు సమృద్ధిగా ఉంటాయి పంచాగ శ్రవణం ద్వారా తెలిసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు’ అని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం రాత్రి ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలుగు నేలతో తనకు వీడదీయరాని అనుంబంధం ఉందని, ఉగాది తనకెంతో ప్రత్యేకమని గవర్నర్ తన పాత జ్ఞాపకాలను నెమరు వెసుకున్నారు. తన చదవు మొదలైంది తెలుగు నేలపైనేని, తన మొదటి ఉద్యోగం కూడా తెలుగు గడ్డపైనే ప్రారంభమైందని చెప్పారు. ఈ తెలుగు నేల తనకు రెండో జన్మను ఇచ్చిందని, నలభై ఆరేళ్ల కిందట జరిగిన ఓ దుర్ఘటనలో కర్నూలులో రెండు రోజుల కోమాలో ఉండి బతికి బయటపడ్డానని, ఇది ఉగాది రోజే జరిగిందని, అందుకే ఉగాది అంటే తమ కుటుంబానికి ప్రత్యేకమని వివరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజభవన్ ఉద్యోగుల కోసం కొత్తగా ఫ్లాట్స్ నిర్మాణం మొదలు పెట్టారని, ఆ సముదాయానికి సమృద్ధి అని పేరు పెట్టామని, రాజభవన్ సమృద్ధిగా ఉంటే రెండు రాష్ట్రాలు సమృద్ధిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
(రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల ఫొటోలు)
సమృద్ధిగా వర్షాలు: పంచాంగ శ్రవణంలో శ్రీవిద్యా శ్రీకాంత శర్మ
ఉగాది వేడుకల్లో బ్రహ్మశ్రీ కొండగప శ్రీవిద్యా శ్రీధర్ శర్మ పంచాగ పఠనం చేశారు. దుర్ముఖి నామ సంవత్సరం కంటే ఎక్కువగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంచాంగ పఠనంలో పేర్కొన్నారు. గత ఏడాది కంటే తేడాలు ఉండవన్నారు. కీళ్లు, మెదడు, నరాల సంబంధ వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు. బంగారు, వెండి, పెట్రోలు ధరలు నిలకడగా ఉంటాయని, నకిలీ మందుల బెడద తప్పక పోవచ్చనఆనరు. సంప్రదింపుల ద్వారా సరిహద్దు రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్
‘ తెలుగు వారు కాకపోయినప్పటికీ గవర్నర్ ప్రతీ ఏటా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు, ఆయన అభినందనీయులు. తెలంగాణ ప్రజల తరపున గవర్నర్‌కు అభినందనలు, కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకంక్షలు..’.
రాజ్‌భవన్ మనుషులను కలిపే వేదిక అయ్యింది : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
‘ రాజ్‌భవన్ కళకళలాడుతోంది. రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబిస్తోంది. మనుషులను కలిపే వేదికగా రాజ్‌భవన్ పనిచేస్తోంది. ఉగాది విషయంలో కొంత గందరగోళం ఉంది. గవర్నర్ ఒక రోజు ముందే వేడుకలు జరిపినా, నాకు గానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గానీ ఎలాంటి గందరగోళం లేదు. బుధవారం ఉగాది జరుపు కొంటాం. పాలకులుగా ఆలోచించి ప్రజలకు సుపరిపాలన ఇస్తాం. అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. ఉభయ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు..’.
ప్రముఖుల హాజరు
రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్‌రెడ్డిని గవర్నర్ తన పక్కనే కుర్చీ వేయించి కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు వేడుకల్లో గడిపిన తర్వాత వైఎస్ జగన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి వెళ్లారు. స్పీకర్ ఎస్. మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు వెంట మంత్రి అచ్చన్నాయుడు హాజరు కాగా, తెలంగాణ కేబినెట్ నుంచి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీ తారక రామావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, సీఎస్ ఎస్.పి.సింగ్ తదితరులు హాజరయ్యారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఉగాది వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీకి చెందిన రామాచారి బృందం గీతాలు అలపించగా, అరబి వయోలిన్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు గురువు అశోక్ గురజాల నేతృత్వంలో వయోలిన్ సింఫనీ నిర్వహించారు. మంజుల రామస్వామి శిశ్య బృందం ఇచ్చిన దీపనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది.