ఒకే వేదికపై ఇద్దరు చంద్రులు!!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇద్దరి మధ్య సాధారణంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఇద్దరూ ఇరుగు పొరుగు రాష్ట్రాలకు సీఎంలు. వాళ్లిద్దరూ పరస్పరం ఎదురుపడటమే కష్టం. అలాంటిది ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? పరస్పరం వాళ్లిద్దరూ ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటారు? ఫీజు రీయింబర్స్మెంట్, విద్యుత్ సమస్య, నదీజలాల పంపిణీ.. ఇలాంటి విషయాలేమైనా వాళ్ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా? అసలు వాళ్లిద్దరూ ఒకే వేదికపైకి ఎలా వస్తారో చూస్తారా...
చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు ఇద్దరికీ ఉన్నది ఒకే గవర్నర్.. ఆయనే ఈఎస్ఎల్ నరసింహన్. రంజాన్ మాసం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. దానికి ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించారు. దాంతో కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు వెళ్లనున్నారు. అక్కడైనా రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సుహృద్భావ వాతావరణంలో సంభాషణలు జరిగి ప్రస్తుతం ఉన్న సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.