హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలని చూస్తోందన్నారు.
జీఎస్టీ బిల్లు ఆమోదానికే ఈ సమావేశాలని ప్రభుత్వం మాట్లాడటం దురదృష్టకరమని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్తో పాటు అనేక కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. కీలకమైన ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన సూచించారు.
కాగా శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమవుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలు నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.