ప్యాకేజీ-1లో భూగర్భ పంపుహౌస్!
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-1లో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈ ప్యాకేజీలోని పంపుహౌస్ నిర్మాణానికి అటవీ శాఖ తీవ్ర అభ్యంతరం లేవనెత్తడంతో.. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నీటి పారుదల శాఖ ఇప్పటికే పంపుహౌస్ నిర్మాణ ప్రాంతంలో అటవీ చట్టాలను ధిక్కరించి పనులు చేపట్టిందని.. అందుకు బాధ్యులైన అధికారులు, ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రభుత్వానికి లేఖ రాశారు కూడా. దీంతో అటవీ సమస్య లేకుండా భూగర్భ నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.
పనులకు ఇబ్బంది : ఒకటో ప్యాకేజీలోని స్టేజ్-1 పంపుహౌస్ పనులను సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలు గత నెలలోనే ప్రారంభించాయి. అయితే ఈ ప్రాంతంలో 287 ఎకరాల మేర అటవీ భూమి ఉన్నందున పంపుహౌజ్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని కాంట్రా క్టు ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. కల్వకుర్తి పంపుహౌస్‌కు 300 మీటర్ల దూరంగా పశ్చిమాన భూగర్భంలో పంపుహౌస్‌నిర్మాణానికి అనుమతించాలని కోరింది. సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం పరిశీలిస్తున్న సమయంలోనే... తొలి ప్రతిపాదనను తప్పుబడుతూ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పీకే శర్మ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఎలాం టి అనుమతులు లేకుండా అటవీ స్థలంలో పనులు ప్రారంభించారని, ఇది 1980 అటవీ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశా రు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేయడంతోపాటు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
భూగర్భంలోనే బెటర్: చీఫ్ కన్జర్వేటర్ లేఖపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సమాలోచన జరిపింది. ప్రాజెక్టుకు ఇదే మొదటి పంపుహౌస్ అయినందున, అటవీ అనుమతుల కోసం నిర్మాణం ఆగితే మొత్తం ప్రాజెక్టు ఆగి పోతుందని నీటి పారుదల శాఖ భావిస్తోంది. అదే జరిగితే నిర్ణీత సమయంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేమని, ఆ ప్రభావం డిండి ప్రాజెక్టుపైనా ఉంటుందని యోచిస్తోం ది. అందువల్ల పంపుహౌస్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమనే అభిప్రాయానికి వచ్చింది. ప్రాజెక్టులోని మిగతా స్టేజ్‌ల్లో పంపుహౌస్‌లను భూగర్భంలోనే నిర్మిస్తున్నందున స్టేజ్-1ను అలాగే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. భూగర్భ నిర్మాణానికి అనువైన ప్రాంతంపై కర్ణాటక కొల్లార్‌లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం)తో అధ్యయనం చేయించ గా.. వారు సానుకూలత వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. భూగర్భంలో నిర్మాణంతో రూ.120 కోట్ల వరకు అదనపు వ్యయం ఉంటుందని చెబుతున్నాయి.