♦ ‘పాలమూరు’ప్రాజెక్టులో గృహాల పరిహారం చెల్లింపుల నిబంధనల సడలింపునకు ఆర్‌అండ్‌బీ శాఖ నో
♦ రూ.4 లక్షల కన్నా అధిక విలువ చేసే గృహాలకు పూర్తి సర్వే చేశాకే పరిహారం నిర్ణయించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్న గృహాలకు పరిహారం చెల్లింపును పక్కాగా, వేగంగా చేసేందుకు నీటి పారుదల శాఖ తీసుకొచ్చిన మార్గదర్శకాలకు రోడ్లు, భవనాల శాఖ మోకాలడ్డుతోంది. ముంపు ప్రాంతాల్లో గృహా లపై పంచాయతీరాజ్, ఆర్‌అండ్ బీ శాఖల సర్వేలు, విలువను మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లింపు విధానాన్ని పక్కనపెట్టి, కొత్తగా గృహనిర్మాణ రకాన్ని బట్టి చదరపు అడుగును ప్రాతిపదికగా తీసుకొని సత్వరమే చెల్లింపులు చేసేలా వేసిన ప్రణాళికలపై నీళ్లు చల్లుతోంది. కేవలం రూ.4 లక్షల విలువ చేసే గృహాల వర కైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతకుమించి విలువజేసే నిర్మాణాలైతే మాత్రం తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని కరాఖండీగా చెబుతోంది. ఇది నీటి పారుదల శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది.
మార్పు చేస్తామంటే కుదరదు..
ఆర్‌అండ్‌బీ కొత్త నిబంధనల ప్రకారం గృహ నిర్మాణం ప్రాథమిక అంచనా మొత్తం రూ.4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింథ్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. ఆ మొత్తం రూ.4 లక్షలకంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం లెక్కగడతారు. ఈ విధానాన్ని పాలమూరు ప్రాజెక్టులో అమలు చేస్తే తీవ్ర జాప్యం జరుగుతుంద ంటూ నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పరిహారాన్ని లెక్కించేందుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, అటవీశాఖల మధ్య సమన్వయం కుదరాలని, అది సమయానుకూలంగా జరగకుంటే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని వివరించింది.
గతంలో ఇలాంటి విధానాల వల్ల పరిహార చెల్లింపుల్లో అనేక అక్రమాలు జరిగాయని, శాఖ సమన్వయ లేమితో ప్రాజెక్టులు పూర్తికాలేదని తెలిపింది. ఈ దృష్ట్యా రూ.4 లక్షల పైచిలుకు ఉన్న గృహ నిర్మాణాలకు సైతం గృహ నిర్మాణ రకాన్ని అనుసరించి ముందుగా నిర్ణయించిన రేట్లకు ప్రకారం చదరపు మీటర్ చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలపై రెండు రోజుల కిందట ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నీటి పారుదల శాఖకు లేఖ రాశారు. రూ.4 లక్షల పైబడి ఉండే గృహాలకు నిర్మాణ వైశాల్యాల ఆధారంగా పరిహారం చెల్లించడం కుదరదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గృహానికి పూర్తి స్థాయి కొలతలు తీసుకొని, వాటర్ సరఫరా, విద్యుత్ సౌకర్యం అన్నీ పరిశీలించాకే దాని వ్యయాన్ని లెక్కించాలని తేల్చి చెప్పింది. ఒక్క ప్రాజెక్టు కోసం ప్రత్యేక నిబంధనలు తెస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయానికి రావాలని నీటి పారుదల శాఖ యోచిస్తోంది.
సత్వర పరిహారానికి మోకాలడ్డు!
Published Sat, Mar 12 2016 4:37 AM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM
Advertisement
Advertisement