సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు దక్కించుకున్న ఈ ప్రాజెక్టుకు తాజాగా అటవీ శాఖ సైతం అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం పథకానికి అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని అటవీ అడ్వయిజరీ కమిటీ(ఎఫ్‌ఏసీ) ఈ మేరకు నిర్ణయం చేసింది. అటవీ అనుమతులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ మంగళవారం మినిట్స్ జారీ చేసింది. దీంతో 3,168.13 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకునేందుకు నీటి పారుదల శాఖకు లైన్‌క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా రూ.80,499.71 కోట్ల అంచనాతో కాళేశ్వరాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే.
గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించేలా 150 టీఎంసీల సామర్థ్యంతో 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. ఈ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణానికి భూసేకరణ, అటవీ అవసరాలు భారీగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణతో పాటు 3,168.13 హెక్టార్లు(7,920.72 ఎకరాల) మేర అటవీ భూమి అవసరం ఉంది. ఈ మొత్తం భూమిలో 13,706 హెక్టార్లు(34,265 ఎకరాలు) పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అటవీ అనుమతులు కీలకంగా మారాయి.
అటవీ అనుమతులకు ప్రాధాన్యత
ప్రస్తుతం కోర్టు కేసులు, గ్రీన్ ట్రిబ్యునళ్ల తీర్పుల నేపథ్యంలో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ప్రాజెక్టులో అటవీ అనుమతుల అంశానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత నెల 21న ఎఫ్‌ఏసీ ఎదుట హాజరై అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూములు, ఆ భూముల్లో మొక్కల పెంపకంపై వివరణ ఇచ్చింది. హెక్టారుకు 1,600 మొక్కలు పెంచేందుకు వీలుగా అవసరమైన నిధులను ఇచ్చేందుకు సానుకూలత తెలిపింది. అటవీ జంతువుల సంచారానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా చూసుకోవడంతోపాటు, జంతు పరిరక్షణ చట్టం–1972ను పక్కాగా అమలు చేసే బాధ్యతలను తామే తీసుకుంటామని తెలిపింది.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎఫ్‌ఏసీ అటవీ అనుమతులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇదే సమయంలో ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జెడ్)ల నుంచి అటవీ భూములను మినహాయించాలని రాష్ట్రం కోరిన వినతికి సైతం ఎఫ్‌ఏసీ సానుకూలంగా సమ్మతించింది. అయితే కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల తీర్పులకు లోబడి ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అటవీ అనుమతుల నేపథ్యంలో అనుమతించిన అటవీ భూములకు సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియను నీటిపారుదల శాఖ ముమ్మరం చేయనుంది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా చూపిన భూమిలో తిరిగి మొక్కల పెంపకానికి అయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment