రాజసూయ యాగ పరిసమాప్తి వేళ నానాదిక్కుల నుంచీ తరలివచ్చిన సామంతులు ధర్మజ సమ్రాట్టుకు అనేకానేక కానుకలూ.. కప్పాలూ చెల్లించుకుంటారు.. అచ్చం కేంద్ర బొక్కసాన్ని తమ తమ వాటా సొమ్ములతో సుసంపన్నం చేసే మన రాష్ట్రాల మాదిరిగా...! కానీ ఈ బడ్జెట్‌లో రాష్ట్రం పరిస్థితి ఈ సభలాగే వెలవెలబోయింది..!!
సాక్షి, హైదరాబాద్ : మరోసారి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశనే మిగిలించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులన్నీ కేంద్రం పక్కనబెట్టింది. బడ్జెట్‌లో కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ప్రస్తావనే లేదు. ఈ మూడింటికీ కేంద్రం నుంచి తగినంత ఆర్థిక సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలూ అడియాసలయ్యాయి.
గోదావరి నుంచి సాగునీటిని అందించేందుకు భారీ ఎత్తున నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, చెర్వుల పునరుద్ధరణకు రూ.5 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. మిగతా రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా ఉన్న ఈ రెండు పథకాలకు తగినంత ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవటం నిరాశపరిచింది.
గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు
తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2018–19 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. హైదరాబాద్ ఐఐటీలో నాణ్యత ప్రమాణాల పెంపునకు రూ.75 కోట్లు కేటాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది. దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్‌లోని అమరకంఠక్‌లో ఉండగా, ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ రెండోదిగా రికార్డులకెక్కనుంది.
పెరిగిన పన్నుల ఆదాయం
ప్రత్యేకంగా వరాలేమీ లేకపోయినా.. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు, ప్రాయోజిత పథకాల నిధులే తెలంగాణకు మరోసారి పెద్ద దిక్కుగా మారనున్నాయి. తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది దాదాపు రూ.30,308.69 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది.
కేంద్ర పన్నుల వాటాలో ఈసారి రాష్ట్రానికి భారీగానే నిధులు రానున్నాయి. జీఎస్‌టీ పూర్తిస్థాయి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారీగా అంచనా వేసుకుంది. దీంతో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రూ.19,207.43 కోట్లు రానున్నాయి. 14వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంపిణీ అవుతుంది.
మొత్తం రూ.7.88 లక్షల కోట్ల పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా అందులో 2.437 శాతం నిధులు రాష్ట్రానికి విడుదలవుతాయి. ఈ నిధులను కేంద్రం ఏ నెలకానెలా విడుదల చేస్తుంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి పన్నుల వాటాలో రూ.16,401.13 కోట్లు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది రూ.2,806.30 కోట్లు రాష్ట్రానికి అదనంగా రానున్నాయి.
కేంద్ర పథకాలు.. గ్రాంట్లు
నిరుటితో పోలిస్తే కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులు సైతం పెరగనున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత బడ్జెట్‌లో రూ.6,694 కోట్లు కేటాయించగా ఈసారి అంచనాల్లో రూ.8,333 కోట్లు పొందుపరిచారు. వీటికి తోడు వచ్చే ఏడాది రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు రూ.2,768.26 కోట్లు కేంద్రం గ్రాంట్ల రూపంలో విడుదల చేయనుంది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు ఈ నిధుల కేటాయింపు తప్పనిసరి.
రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
రాష్ట్రాల వారీగాకాక మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయించారు. కేంద్రం గతేడాది నుంచి ఈ కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. ఇంటింటికి మంచినీరు, రైతుల ఆదాయం రెట్టింపు, రైల్వే, మౌలిక వసతులకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. కేంద్ర బడ్జెట్‌పై ఇంకా కొంత స్పష్టత రావాలి. ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టత లేదు.
– టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి
‘మద్దతు’ ఒక్కటే అనుకూలం
రైతులకు మద్దతు ధర పెంపు అంశం ఒక్కటే బడ్జెట్‌లో అనుకూల అంశంగా కనిపిస్తోంది. ఈ మద్దతు ధర సైతం అన్ని పంటలకా లేక కొన్నింటికే పరిమితమా అన్న విషయంలో స్పష్టత లేదు. మొదటి బడ్జెట్‌లోనే ఈ ప్రతిపాదన ఉంటే మూడేళ్లుగా రైతులు లబ్ధి పొందేవారు. రైతులకు మద్దతు ధర ఎలా కల్పిస్తారో చెప్పకపోవడం బాధాకరం. పేదలకు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య ఖర్చు భరిస్తామనడం సంతోషకరం.
– కె.కవిత, ఎంపీ
తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధులు(2018–19) (రూ.కోట్లలో..)
కేంద్ర పన్నుల వాటా - 19,207.43
కేంద్ర ప్రాయోజిత పథకాలు - 8,333
14వ ఆర్థిక సంఘం నిధులు - 2,768.26
మొత్తం - 30,308.69
తెలంగాణకు కేంద్ర పన్నుల ఆదాయం (రూ.కోట్లలో)
సెంట్రల్ జీఎస్టీ 6,181.16
కార్పొరేట్ ట్యాక్స్ 5,392.78
ఆదాయ పన్ను 4,772.31
కస్టమ్స్ ట్యాక్స్ 946.26
ఎక్సైజ్ డ్యూటీ 922.11
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 511.77
మొత్తం 19,207.43
Comments
Please login to add a commentAdd a comment