నిర్బంధానికి పరాకాష్ట
పొన్నం దీక్ష భగ్నంపై ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను తెల్లవారుజామున అరెస్టు చేయడం టీఆర్‌ఎస్ నిర్బంధకాండకు పరాకాష్ట అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రజాస్వామికంగా కొట్లాడటమే తప్పా అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ పాలకుల దాష్టీకానికి గురైన దళితులను పరామర్శించడానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ సభ పెడతామంటే అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడేమో ఇచ్చిన హామీపై మాట్లాడకుండా పొన్నంను అరెస్టు చేశారని విమర్శించారు.
మెడికల్ కాలేజీపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లో, ఫాంహౌజ్‌లో గడుపుతూ ప్రజల మధ్యకు రావడానికి భయపడుతున్నారని దుయ్యబట్టారు. సిరిసిల్లలో దళితులపై పోలీసులతో థర్డ్ డిగ్రీని ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బాధిత దళితులను దొంగచాటుగా వేములవాడలో పరామర్శించి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.