ఫాసిస్టులా కేసీఆర్: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి సొమ్ముతో అహంకారం, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి సొమ్ముతో రాజకీయాలను, ప్రజాస్వామ్యాన్ని శాసించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ మీదనే ఉందన్నారు. పాలేరులో ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామంటే సమయం ఇవ్వలేదన్నారు. పాలేరులో పార్టీని గెలిపించే బాధ్యతను యూత్ కాంగ్రెస్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఇతర ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు.
కాగా ఖమ్మంలో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ ఖర్చులను పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖాతాలో జమచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో వారు గురువారం విలేకరులతో మాట్లాడారు.