పిచ్చి తుగ్లక్కు ప్రతిరూపం సీఎం కేసీఆర్ | Uttam Kumar Reddy compared KCR to Tughlaq | Sakshi
Sakshi News home page

పిచ్చి తుగ్లక్కు ప్రతిరూపం సీఎం కేసీఆర్

Published Tue, Oct 11 2016 1:20 AM | Last Updated on Tue, Oct 16 2018 8:27 PM

పిచ్చి తుగ్లక్కు ప్రతిరూపం సీఎం కేసీఆర్ - Sakshi

పిచ్చి తుగ్లక్కు ప్రతిరూపం సీఎం కేసీఆర్

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ధ్వజం
సోయిలేకుండా ఫాంహౌస్‌లో ఉంటున్నదెవరు?
సిగ్గూ, శరంలేకుండా అబద్ధాలు... మాయమాటలు
రుణమాఫీ చేయనందుకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారా?

 సాక్షి, హైదరాబాద్: పిచ్చి తుగ్లక్‌ను చూడలేదనే అవసరం లేకుండా, తుగ్లక్ ప్రతిరూపంగా ప్రజలు సీఎం కేసీఆర్‌ను చూసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు. ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ నేతలు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, ఎం.కోదండరెడ్డితో కలసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎంగా సామా న్య ప్రజలకే కాకుండా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండాలనే సోయిలేకుం డా ఫాంహౌస్‌లో ఉంటున్నదెవరని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతులు, విద్యార్థుల సమస్యల గురించి అడిగితే పరిష్కరించాల్సింది పోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు తగదని హెచ్చరించారు. ‘ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అబ ద్ధాలు, మాయమాటలతో అధికారంలోకి రావడంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కినయి.

రైతులకు రుణమాఫీ చేయాలంటే తప్పా? విద్యార్థులకు ఫీజులను రీయింబర్స్ చేయాలని బాధ్యతాయుతమైన ప్రతిపక్షపార్టీగా సోయితోనే అడిగినం. జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు అడిగినం. 5 లక్షల మందితో ఒక జిల్లా, 50 లక్షల మందితో మరో జిల్లానా..? పరిపాలనా సౌలభ్యం అందరికీ ఒకేరకంగా ఉండొద్దా? వీటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌పార్టీని, వ్యక్తిగతంగా నన్ను సంస్కారం లేకుండా కేసీఆర్ హేళనగా మాట్లాడటం మంచిదికాదు. దేశ చరిత్రలోనే ఇలాంటి సంస్కారం, సంస్కృ తి తెలియని ముఖ్యమంత్రి ఉండరు. ఇకపై సీఎం కేసీఆర్‌కు మర్యాద ఇచ్చేది లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌కు ఇంగితజ్ఞానం ఉంటే రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. నిర్లజ్జగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ప్రతిపక్షాలను హేళన చేయడం మానుకోవాలని సూచించారు.

పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకేనా?
రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్లలో పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే అప్పగించారని ఉత్తమ్ ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు, తెలంగాణ కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు దక్కినాయో లెక్కలతో సహా రెండ్రోజుల్లో బయటపెడ్తామని ఉత్తమ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వ్యకిగత విషయాలను మాట్లాడదలచుకోలేదన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే సోయితోనే కరువు, వరదలతో ఇబ్బందుల్లో ఉన్న రైతులకు భరోసా ఇవ్వడానికి గ్రామాల్లోకి వెళుతున్నామన్నారు.

 రైతులపై అబద్ధాలు..
రైతుల సమస్యలనుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కరువులో ప్రభుత్వం ఆదుకోనందుకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారా?, వరదల్లో చేతికొచ్చిన పంట నష్టపోయినందుకు సంబరాలు చేసుకుంటున్నారా?, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయనందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. 40 లక్షల మంది రైతులతో రుణమాఫీ కోసం, ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ విద్యార్థులతో నెలరోజులపాటు దరఖాస్తులను చేయించనున్నట్టుగా ఉత్తమ్ వెల్లడించారు.

గ్రామాల్లోకి పోదాం.. దమ్ముంటే రా.. సీఎం కేసీఆర్‌కు భట్టి సవాల్
రైతులు పడుతున్న ఇబ్బందులు, వరదల్లో నష్టపోయిన పంటపొలాలను చూసే దమ్ముంటే సీఎం కేసీఆర్ గ్రామాల్లోకి రావాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సవాల్ చేశారు. ఖమ్మం జిల్లాలో పాడైపోయిన పత్తి పంట, నకిలీ విత్తనాలతో కాతలేని మిర్చి పంటలను భట్టి మీడియాకు చూపించారు. కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement